టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. మిగతా సీనియర్ హీరోలు డీసెంట్ హిట్లు కొడుతుంటే.. నాగ్ మాత్రం సినిమా సినిమాకూ మార్కెట్‌ను దెబ్బ తీసుకుంటూ మరింత కిందికి పడిపోతున్నారు. నాగ్ సినిమాలకు టాక్ బాగున్నా కూడా వసూళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండేళ్ల కిందట వచ్చిన ‘వైల్డ్ డాగ్’ విషయంలో అదే జరిగింది. గత ఏడాది ‘ది ఘోస్ట్’ సైతం కనీస ప్రభావం చూపలేకపోయింది.
దీంతో ఇలాంటి సీరియస్ సినిమాలు చేస్తే వర్కవుట్ కాదని.. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా లాంటి ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో నాగ్ జట్టు కట్టాడు. అతను దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నాగ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక మలయాళ హిట్‌కు రీమేక్ అట. 2019లో విడుదలైన మాలీవుడ్ మూవీ ‘పొరింజు మరియం జోస్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట ప్రసన్న కుమార్. ఐతే మూల కథను మాత్రమే తీసుకుని.. తెలుగు నేటివిటీ, నాగ్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తీయనున్నాడట ప్రసన్న కుమార్. మలయాళం కొంచెం సీరియస్‌గా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో కొంచెం సరదాగా సాగేలా మారుస్తున్నారట.
ఒరిజినల్లో జోజు జార్జ్ చేసిన రౌడీ పాత్రనే నాగ్ తెలుగులో చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. నాగ్ చాన్నాళ్ల తర్వాత చేయనున్న రీమేక్ మూవీ ఇది. స్ట్రెయిట్ సినిమాలతో లభించని హిట్.. రీమేక్‌తో అయినా ఆయనకు దక్కుతుందేమో చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.