తారకరత్న.. అడుగడుగునా దురదృష్టమే

నందమూరి తారకరత్న తెరంగేట్రం ఒక సంచలనం. ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ హీరోకూ దక్కని రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. అరంగేట్రంలోనే ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం అప్పట్లో పెను సంచలనమే.

అతడి లాంచింగ్‌ను అంత ఘనంగా ప్లాన్ చేశారు. ఒక స్టూడియోలో తొమ్మిది సినిమాలకు విడివిడిగా ముహూర్త వేడుకలు ఏర్పాటు చేసి.. తారకరత్న వరుసగా ఒక్కో వేడుకలో పాల్గొనడం గురించి అప్పట్లో మీడియాలో హోరెత్తింది. కానీ ఇంత ఘనంగా మొదలైన అతడి కెరీర్.. తర్వాత ఊహించని మలుపులు తిరిగింది. ఒకేసారి ప్రారంభోత్సవం జరుపుకున్న తొమ్మిది చిత్రాల్లో నాలుగో ఐదో మించి ముందుకు కదల్లేదు.

అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కీరవాణి లాంటి ఉద్దండులు కలిసి చేసిన తారకరత్న తొలి చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’లో పాటలు బాగున్నా.. సినిమాలో పెద్దగా విషయం లేకపోవడంతో తారకరత్నకు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. ఒక్కటి కూడా తారకరత్నకు విజయాన్ని అందించలేకపోయాయి. హీరోగా వరుస పరాజయాలు అందుకున్నాక ఇక లాభం లేదని విలన్ అవతారం ఎత్తాడు నందమూరి హీరో.

నెగెటివ్ రోల్‌లో అతడి తొలి చిత్రం ‘అమరావతి’లో నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది కానీ.. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ తారకరత్నకు నిరాశే ఎదురైంది. ఆపై తారకరత్న చేసిన సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీడియాతో పాటు జనాలు కూడా క్రమంగా అతడి సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. బాలకృష్ణకు సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి తన సినిమాల్లో తారకతర్నకు ఛాన్సులు ఇచ్చి కెరీర్‌ను గాడిన పెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

సినిమా కెరీర్ ఇలా తయారైతే.. ఇంతలో వ్యక్తిగత జీవితంలో తారకరత్న కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని పెళ్లాడడంతో మొత్తంగా నందమూరి కుటుంబం అతడిని దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఓవైపు సినిమా కెరీర్ దెబ్బ తిని, ఇంకోవైపు కుటుంబ పరంగానూ సమస్యలు ఎదుర్కొని కొన్నేళ్ల పాటు తారకరత్న లైమ్ లైట్లోనే లేకుండా పోయాడు.

ఇవన్నీ దాటుకుని.. సినీ కెరీర్ మీద ఆశలు వదులుకుని, కుటుంబ పరంగా అన్ని సమస్యలనూ అధిగమించి.. చివరగా రాజకీయాల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు తారకరత్న. ఇటు బాలయ్యకు, అటు చంద్రబాబుకు దగ్గరై తెలుగుదేశం పార్టీ కోసం పని చేయాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలని అతను భావించాడు. ఈ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడో లేదో.. అంతలోనే గుండెపోటు అతణ్ని కబళించింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్ల తర్వాత.. రాజకీయాల్లో అయినా విజయవంతం అయి మంచి స్థితికి చేరాలనుకున్న సమయంలో ఇలా తారకరత్న హఠాత్తుగా కన్నుమూయాల్సి రావడం బాధాకరం.