కరోనా మహమ్మారి ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. దీని కారణంగా ఎన్ని వందలు, వేల కోట్ల నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో నెలా రెండు నెలల్లో అంతా మామూలైపోతుందని అనుకున్నారు సినీ జనాలు.
ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాలు రిలీజ్ చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇంకో మూడు నెలలకు కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే రాజమౌళి కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై భయం గొలిపేలా హెచ్చరికలు జారీ చేశాడు.
ఇప్పుడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ లైన్లోకి వచ్చారు. ఆయన రాజమౌళిని మించి ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు. దసరాకు మామూలు పరిస్థితులు వచ్చేస్తాయి.. పెద్ద సినిమాల సందడి మొదలవుతుంది అనుకుంటే.. అలాంటి ఆశలేం పెట్టుకోవాల్సిన పని లేదని అరవింద్ తేల్చేశారు.
డిసెంబరు-జనవరి నాటికి కానీ థియేటర్లు తెరుచుకోకపోవచ్చని అరవింద్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ఎత్తేసినా, కరోనాకు మందు వచ్చినా కూడా.. అందరూ ధైర్యం చేసి గుంపులుగా కలవడానికి ఆర్నెల్ల పైనే పడుతుందని అరవింద్ అన్నారు.
థియేటర్లు, షాపింగ్ మాల్స్ లాంటి ప్రదేశాలు ప్రమాదకరం అనే అభిప్రాయం జనాల్లో మనసుల్లో ఉండిపోతుందని.. అన్నింటికంటే చివరగా థియేటర్లు ప్రారంభం అవుతాయని.. సాధారణ పరిస్థితులు రావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని అరవింద్ అంచనా వేశారు.
చిన్న సినిమాలకు గడ్డు కాలం తప్పదని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలకు అయినంత ఖర్చును ఇచ్చి కొనుగోలు చేయవని.. అలాగని థియేటర్లలో రిలీజ్ చేసే సమయం వరకు ఎదురు చూస్తే వడ్డీలు సినిమాను తినేస్తాయని.. ఈ వడ్డీల్ని తట్టుకుని నిలబడే సినిమాలు మాత్రమే నెట్టుకొస్తాయని చెెప్పడం ద్వారా చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి దయనీయంగా ఉండబోతోందని అరవింద్ చెప్పకనే చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates