పుత్రోత్సాహం ట్వీట్లో చిరు పొరబడ్డారా

ఆర్ఆర్ఆర్ ఏడాదికి పైగా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆస్కార్ వేడుక దగ్గర పడుతున్న వేళ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ చేసుకుంటున్న ట్విటర్ వార్స్ నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నామినేషన్ల టైంలో మాటా మాటా గట్టిగానే అనుకున్నారు. వాస్తవంగా ఇద్దరు స్టార్లు ఎంత మంచి స్నేహితులైనా ఆ బాండింగ్ అభిమానుల మధ్య లేదు. దీని సంగతలా ఉంచితే నిన్న చిరంజీవి పెట్టిన ఒక ట్వీట్ మళ్లీ ఇంకో దుమారానికి దారి తీసింది. పుత్రోత్సాహం పంచుకోవాలన్న ఉద్దేశం ఇంకోరకంగా వెళ్ళింది

ఇటీవలే అవతార్ దర్శకులు జేమ్స్ క్యామరూన్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రిపులార్ లో రామరాజు పాత్రను తీర్చిదిద్దిన విధానం, ఆ డెప్త్ ని ప్రెజెంట్ చేసిన తీరు బాగా నచ్చిందని అన్నారు. అంతే తప్ప రామ్ చరణ్ గొప్పగా నటించాడనో బెస్ట్ యాక్టరనో ప్రస్తావించలేదు. కేవలం జక్కన్న టాలెంట్ ని మాత్రమే పొగిడిన సందర్భమది. ఆ వీడియో కొద్దిరోజుల క్రితమే బయటకి వచ్చింది. దాన్నే మెగాస్టార్ షేర్ చేసుకుని తండ్రిగా చరణ్ అందుకున్న కాంప్లిమెంట్స్ కు గర్వ పడుతున్నానని ట్వీట్ చేశారు. అక్కడి నుంచి మొదలయ్యింది ఆసలు రచ్చ.

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి వీళ్ళనెవరినీ ట్యాగ్ చేయలేదు. సరే ప్రస్తావించింది కొడుకు గురించే కాబట్టి అవసరం లేదనే అనుకుందాం. కానీ వీడియోలో చాలా స్పష్టంగా క్యామరూన్ రామరాజు క్యారెక్టర్ గురించి మాట్లాడారు తప్ప హీరో గురించి కాదనేది కనిపిస్తోంది. అలాంటపుడు ఆ క్రెడిట్ చరణ్ ఒక్కడికే కాదు జక్కన్నకు దక్కుతుంది. ఆయన మాట్లాడిన తీరుని అర్థం చేసుకోలేని ఫ్యాన్స్ మాత్రం దీనికి ఏవేవో అర్థాలు తీసి ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ఫైనల్ గా ఆస్కార్ దక్కడం ఏమో కానీ అంతకు మించిన సస్పెన్స్ డ్రామా సోషల్ మీడియాలో జరుగుతోంది.