చైతూపై అంత నమ్మకమా?


అక్కినేని నాగచైతన్య ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా అతను కోరుకున్న మాస్ ఇమేజ్ రావట్లేదు. ఆ రకమైన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుందామని ఎప్పటికప్పుడు మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు కానీ.. అవి ఇమేజ్‌ను పెంచకపోగా ఇంకా గట్టి దెబ్బ కొడుతున్నాయి. ఎక్కువగా లవ్ స్టోరీలతోనే చైతూ ఘనవిజయాలు అందుకున్నాడు.

ప్రేమకథలు, హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసే చైతూ సర్వైవ్ అవుతున్నాడని.. తన ఇమేజ్ అయితే పెరగట్లేదని యాంటీ ఫ్యాన్స్ తరచుగా కౌంటర్లు వేస్తుంటారు సోషల్ మీడియాలో. వారిని అక్కినేని ఫ్యాన్స్ దీటుగానే ఎదుర్కొంటూ ఉంటారు. పూర్తిగా తన పాత్ర మీద, స్టామినా మీద నడిచే ‘థాంక్యూ’ సినిమాతో చైతూ తన సత్తా ఏంటో చూపిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ సవాళ్లు చేశారు కానీ.. రిలీజ్ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేక చైతూ‌కు అవమాన భారాన్ని మిగిల్చిందా సినిమా.

సినిమాలో ఎంత కంటెంట్ లేకపోయినా సరే.. ఓపెనింగ్స్ ఇంత దారుణంగా ఉండడం చైతూ స్టార్ ఇమేజ్‌ మీద ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి టైంలోనే చైతూ.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో జట్టు కట్టాడు. వీరి కలయికలో వస్తున్న ‘కస్టడీ’ మీద నిర్మాత శ్రీనివాసా చిట్టూరి కొంచెం పెద్ద బడ్జెట్టే పెట్టేస్తున్నట్లు సమాచారం. చైతూ మార్కెట్‌ను మించే అతను రిస్క్ చేస్తున్నాడట. ముందు నుంచి ఈ సినిమాకు బాగా ఖర్చవుతుండగా.. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం ఒక్క పాట కోసం ఏడు సెట్లు వేసినట్లుగా బయటికి వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పెద్ద హీరోలైనా సరే.. ఒక పాట చిత్రీకరణ ఒక సెట్లోనే పూర్తి చేస్తారు. కొన్ని సందర్భంగా రెండు మూడు సెట్లు మారుస్తుంటారు. కానీ చైతూ రేంజ్ హీరోకు ఏడు భారీ సెట్లు అంటే.. టూమచ్ అనిపిస్తోంది. చైతూ చేసిన మాస్ సినిమాల ఫలితాలు, అతడి చివరి చిత్రం ‘థాంక్యూ’ రిజల్ట్ చూసి కూడా ఇంతింత రిస్క్ ఎలా చేస్తున్నారో అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.