డిస్కౌంట్ రేట్లతో పఠాన్ గేలం

ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల గ్రాస్ ని దాటేసి సహస్రంని టార్గెట్ చేసిన పఠాన్ బ్లాక్ బస్టర్ పరుగుని యష్ రాజ్ ఫిలింస్ ఇప్పట్లో ఆపే ఉద్దేశంలో లేదు. థియేట్రికల్ రన్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. రేపు శుక్రవారం దేశవ్యాప్తంగా పివిఆర్ ఐనాక్స్ వంటి సుప్రసిద్ధ మల్టీ ప్లెక్సుల్లో టికెట్ ధర కేవలం 110 రూపాయలు ఉంచబోతున్నారు. రిలీజ్ రోజు ఇది 325 నుంచి 2000 దాకా ఉంది. అంటే ఏ స్థాయిలో తగ్గింపో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకూ ఇది వర్తిస్తుంది

ఇదే రోజుని ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. పఠాన్ ఫైనల్ రన్ కు దగ్గర పడుతోంది. ఊహించిన దాని కన్నా ఎక్కువ మొత్తం వచ్చినప్పటికీ ఇంకా పిండుకోవాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ మార్చింది. పైగా అమెజాన్ ప్రైమ్ దీని ప్రీమియర్ ని వచ్చే మార్చిలో ప్లాన్ చేసుకుందట. అది కూడా అగ్రిమెంట్ ప్రకారమే. ఆ ప్రకటన వచ్చేలోగా వెయ్యి మార్కు దాటేస్తే ల్యాండ్ మార్క్ నిలిచిపోతుంది. రేపు కార్తీక్ ఆర్యన్ షెహజాదా రిలీజ్ కాబోతోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ మన అల వైకుంఠపురములోకి అఫీషియల్ రీమేకన్న సంగతి తెలిసిందే.

దీని విడుదలని టార్గెట్ గా చేసుకునే పఠాన్ బృందం ఇలా చేయడం భావ్యం కాదని ట్రేడ్ అంటోంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్న షెహజాదాకు ఇప్పుడీ పఠాన్ డిస్కౌంట్ వ్యవహారం గుదిబండగా మారుతుంది. షారుఖ్ ని తెరమీద రిపీట్ చూడాలనుకునే ఫ్యాన్స్, మూవీ లవర్స్ సహజంగానే కొత్త రిలీజులకు దూరంగా ఉంటారు. రీమేక్ అని ముందే తెలుసు, ఒరిజినల్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో చూసేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సవాల్ గా మారుతోంది. దీని సంగతి ఎలా ఉన్నా పఠాన్ ప్లానింగ్ మాత్రం అదుర్స్ అనిపించుకుంటోంది