టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అత్యంత ఆకర్షించేది ఎవరంటే మరో ఆలోచన లేకుండా విక్టరీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయనకు కుటుంబ ప్రేక్షకుల్లో ముందు నుంచి గొప్ప ఆదరణ ఉంది. లేడీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉంటారు ఆయనకు. కెరీర్లో వెంకీ ఎక్కువ సినిమాలు చేసింది, పెద్ద పెద్ద హిట్లు కొట్టింది కుటుంబ కథా చిత్రాలతోనే. అందుకే ఆయన అభిమాన వర్గంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఆయన సినిమాలు కుటుంబ సమేతం చూసేలా క్లీన్ ఎంటర్టైన్మెంట్‌తో తెరకెక్కుతుంటాయి. బూతులకు, అశ్లీల సన్నివేశాలకు వెంకీ చిత్రాల్లో చోటు ఉండదు. యాక్షన్ సినిమాలు చేసినా.. అందులోనూ అసభ్యతకు చోటు లేకుండా చూసుకుంటాడు వెంకీ. అలాంటి హీరో ఇప్పుడు వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశాడు.
తాజాగా ‘రానా నాయుడు’ ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే యాక్షన్, థ్రిల్లర్ ప్రియులకు మంచి ట్రీట్ ఖాయమని అర్థమవుతోంది. కానీ బాలీవుడ్ వెబ్ సిరీస్‌ల్లో ఉండే అడల్ట్స్ ఓన్లీ అంశాలు కూడా ఇందులో ఉణ్నాయి. ఇంటిమేట్ సీన్లు, బూతులకు ఇందులో లోటు లేనట్లే ఉంది. హిందీ ఒరిజినల్స్‌లో చాలా కామన్ అనదగ్గ బూతులను వెంకీ కూడా అందుకున్నాడు. అలవోకగా బూతులు పలికేశాడు. కానీ ఆ డైలాగులు చెప్పేటపుడు ఆయనెలా ఫీలయ్యాడో కానీ.. వెంకీ ఫ్యాన్స్‌కు మాత్రం ఏదోలా అనిపించింది.
ఈ బూతులు హిందీ ప్రేక్షకులకు మామూలుగా అనిపించవచ్చేమో కానీ.. ఈ సిరీస్‌ను తెలుగులోకి అనువదించినపుడు ఆ బూతులను కూడా యాజిటీజ్ తర్జుమా చేస్తే మాత్రం కష్టమే. వెంకీ నోట అలాంటి బూతులు విని మన వాళ్లు తట్టుకోవడం కష్టమే. మరి ఒరిజినల్లో ఉన్న ఎసెన్స్ దెబ్బ తినకూడదని ఆ బూతుల్ని అలాగే కొనసాగిస్తారా.. లేక వెంకీ ఫ్యాన్స్ మనోభావాలు, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వాటిని పరిహరించి వేరే పదాలు పెడతారా అన్నది చూడాలి.