రాజమౌళి నుంచి త్రివిక్రమ్ చేతికి

జూనియర్ ఎన్టీఆర్ ని పూర్తి స్థాయి పౌరాణికంలో చూడాలన్నది అభిమానుల కోరిక. యమదొంగలో పెర్ఫార్మన్స్ చూశాక అది మరింత ఎక్కువయ్యింది. బాహుబలి కన్నా ముందు మహాభారత గాథని తెరకెక్కించాలని ఉందని రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం అప్పట్లో బాగా హైలైట్ అయ్యింది. ముఖ్యంగా దానవీరశూరకర్ణ లాంటి క్లాసిక్ ని ఇప్పటి టెక్నాలజీ వాడి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీస్తే తారక్ ఏ స్థాయి నటుడో మరోసారి ప్రపంచానికి చెప్పినట్టు అవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ జక్కన్న పూర్తిగా ట్రాక్ మార్చేసి వేరే కథల వైపుకు వెళ్ళిపోయారు.

ఇప్పుడీయన స్థానంలో త్రివిక్రమ్ ఆ బాధ్యతను తీసుకుని తారక్ తో ఒక మైథలాజికల్ సబ్జెక్టుని ప్లాన్ చేస్తున్నారన్న వార్త మూవీ లవర్స్ లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇది స్వయాన నాగవంశీనే వెల్లడించడంతో అసలు ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండానే అంచనాలు పెరుగుతున్నాయి. కొరటాల శివ కన్నా ముందు నిజానికి ఈ కాంబోనే తెరకెక్కాలి. కానీ స్క్రిప్ట్ విషయంలో ఏదో తేడా రావడంతో కాంబినేషన్లు మారిపోయాయి. ఆ టైంలో అయినను పోయిరావలె హస్తినకు టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది. రిజిస్టర్ చేశారన్న టాక్ తిరిగింది కానీ ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు.

సబ్జెక్టు అదో కాదో తెలియదు కానీ మొత్తానికి ఈ కలయిక క్రేజీనే. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్న కాంబో అవుతుంది. అయితే అంత త్వరగా మాత్రం జరగదు. ఎందుకంటే తారక్ ముందు కొరటాల శివది పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ది లాక్ అయిపోయింది. ఈ రెండు కమిట్మెంట్లకు ఎంత లేదన్నా మూడేళ్ళకు పైగానే పడుతుంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుది పూర్తి చేశాక ఇంకో ప్రాజెక్టు చేయబోతున్నారు. హీరో ఎవరన్నది మాత్రం బయటికి రావడం లేదు. పౌరాణికం అంటే ఎంత లేదన్న స్క్రిప్ట్ కే బోలెడు టైం కావాలి. సో భారీ ఆలస్యమైతే తప్పదు మరి.