ముందుగానే పలకరిస్తున్న సార్

అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం ఒక పెద్ద సినిమా గురించి టాక్ లేదా రివ్యూ రావాలంటే కనీసం వారం రోజులు పట్టేది. స్పష్టంగా బాగుందా లేదాని తెలియడానికి ఆ మాత్రం సమయం తప్పేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఎనిమిదిన్నర షో తాలూకు రెస్పాన్స్ ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న కాలేజీ కుర్రాడికి గంటల్లో తెలిసిపోతోంది. సోషల్ మీడియానో వెబ్ సైట్సో లేదా యోట్యూబో ఇలా సవాలక్ష మార్గాలుంటున్నాయి. అందుకే ఒకప్పటిలా ముందస్తు షోలు వేయాలంటే నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది

శుక్రవారం విడుదల కాబోతున్న సార్ విషయంలో మాత్రం నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఎంతగా అంటే ముందు రోజు సాయంత్రమే స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టేశారు. రెండు షోలతో స్టార్ట్ చేశారు కానీ కౌంట్ ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంటెంట్ చాలా బాగా వచ్చిందని ముఖ్యంగా విద్యార్థులకు వల్ల తల్లితండ్రులకు కనెక్ట్ అయ్యే అంశాలను జొప్పించడం పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేశారట.

కమర్షియల్ ఎలిమెంట్స్ ని దర్శకుడు వెంకీ అట్లూరి బాగా హ్యాండిల్ చేశారనే టాక్ ఉంది. ఆ మధ్య రైటర్ పద్మభూషణ్ కు ఈ స్ట్రాటజీని ఫాలో అయిన చాయ్ బిస్కెట్ టీమ్ కేవలం భాగ్యనగరంలోనే కాకుండా ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో స్పెషల్ షోలు వేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అంతకు ముందు మేజర్, 777 చార్లీ ఇదే బాట పట్టాయి. ఈ ట్రెండ్ అర్జున్ రెడ్డితో మొదలయ్యింది. ఒకటి రెండు తప్ప అన్నింటికి ఈ మార్కెటింగ్ బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చింది. మరి సార్ కూడా అదే తరహాలో సెల్యూట్ కొట్టించుకుంటే బాక్సాఫీస్ కు జోష్ వచ్చినట్టే.