పోస్టర్ మీద జేమ్స్ కామెరూన్ పేరు కనిపిస్తే చాలు.. దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతున్నారు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా ‘టైటానిక్’ సినిమా దగ్గర్నుంచి ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
‘టైటానిక్’ అప్పట్లో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేయగా.. ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన ‘అవతార్’ అంతకుమించిన రికార్డులను నెలకొల్పింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్-2’ డివైడ్ టాక్‌ను తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా చూసి అటు యుఎస్ క్రిటిక్సే కాక.. వరల్డ్ వైడ్ సమీక్షకులంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్లో మిశ్రమానుభూతి కనిపించింది. కానీ సినిమా ఎలా ఉన్నా దాన్ని వెండితెరపై చూడాల్సిందే అని వరల్డ్ వైడ్ కోట్లాదిగా ప్రేక్షకులు ఫిక్సయిపోయారు.
డివైడ్ టాక్‌ను తట్టుకునే ‘అవతార్-2’ భారీ వసూళ్లతో సాగిపోయింది. అసాధ్యం అనుకున్న బ్రేక్ ఈవెన్ మార్కును కూడా అందుకుంది. 2 బిలియన్ డాలర్ల మార్కును దాటేసి ఇప్పటికి ఇంకో 200 మిలియన్ డాలర్లను ఎక్కువే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ ఇంకా పెద్ద సంఖ్యలో స్క్రీన్లు, షోలు కొనసాగుతున్నాయి ‘అవతార్-2’కి. ఈ సినిమా ఇలా ఆడుతుండగానే కామెరూన్ మరో విజువల్ వండర్ ‘టైటానిక్’ తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ దీన్ని రీ రీలీజ్ చేశారు. రీమాస్టర్ చేసిన ప్రింట్‌తో మళ్లీ బిగ్ స్క్రీన్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 25 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం. పాతికేళ్ల కిందటి సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమే. ఇలా ఒక దర్శకుడి నుంచి పాతికేళ్ల వ్యవధిలో వచ్చిన రెండు విజువల్ వండర్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుండడం విశేషమే.