రివ్యూయర్ల పై హీరోయిన్ ఆగ్రహం

ఎవరు ఔనన్నా కాదన్నా ఈ రోజుల్లో సినిమాల ఫలితాలను రివ్యూలు నిర్దేశిస్తున్నాయన్నది వాస్తవం. చాలా కొన్ని సినిమాలు మాత్రమే సమీక్షలతో సంబంధం లేకుండా ఫలితాలు అందుకుంటూ ఉంటాయి. మిగతా చిత్రాలన్నీ కూడా రివ్యూలకు అనుగుణంగానే ఆడుతుంటాయి.

ఐతే తమ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు వస్తే ఫిలిం సెలబ్రెటీలు తట్టుకోలేరు. ఎవరి పని వాళ్లది అని అర్థం చేసుకోకుండా రివ్యూయర్ల మీద మండిపడుతుంటారు.

ఐతే రివ్యూల్లో కొన్ని పక్షపాతంతో, సరైన అవగాహన లేకుండా, దురుద్దేశాలతో రాసేవి కూడా ఉంటాయన్నది కూడా వాస్తవమే కానీ.. రివ్యూయర్లందరినీ కలిపి విమర్శించడం.. అసంబంద్ధమైన విమర్శలు చేయడం కూడా తప్పే. ప్రస్తుతం తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే సమీక్షకులపై విరుచుకుపడింది. తాను లీడ్ రోల్ చేసిన ‘కొండ్రల్ పావమ్’ అనే సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో సమీక్షకులపై ఆమె మండిపడింది.

కన్నడ చిత్రం ‘ఆ కరాళ రాత్రి’కి రీమేక్‌గా తెలుగులో పాయల్ రాజ్‌పుత్, కృష్ణచైతన్య జంటగా ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? ఇప్పుడు ‘ఆ కరాళ రాత్రి’ తమిళంలో ‘కొండ్రల్ పావమ్’ పేరుతో రీమేక్ అయింది.

ఐతే తెలుగులో మాదిరే తమిళంలోనూ దీనికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఇది వరలక్ష్మికి రుచించలేదు. ‘‘కొత్త సినిమాలు రిలీజైన వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమాలో అది బాలేదు. ఇది బాలేదు. అసలు మెసేజే లేదు.. అని ఏదేదో చెప్పేస్తున్నారు.

అలాంటి వాళ్లందరినీ నేను అడిగేది ఒక్కటే.. మీరసలు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు? గతంలో అందరూ సినిమాను వినోదం కోసం చూసేవారు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మరిచిపోయి ఏం లోపం వెతుకుదామా అని చూస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పడానికి మీరెవరు? మీరు రివ్యూలు ఇవ్వాలనుకుంటే సినిమా రిలీజయ్యాక ఐదారు రోజులు ఆగండి. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించే అవకాశం ఇవ్వండి’’ అని వరలక్ష్మి పేర్కొంది.