నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలై రెండు వారాలు దాటిపోయింది. అతను ఆసుపత్రి పాలైనపుడు ప్రాణాలు నిలవడం కష్టం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అతడికి ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తారకరత్న ఆసుపత్రి పాలయ్యాక వారం పాటు ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ కనిపిస్తుండేవి. చికిత్స జరుగుతున్న బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు కూడా కొన్ని రోజులు అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చారు.
కానీ గత పది రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పెద్దగా సమాచారం ఏదీ బయటికి రావట్లేదు. సామాన్య జనాల దృష్టి కూడా నెమ్మదిగా ఈ విషయం నుంచి మళ్లిపోయింది. కానీ తారకరత్న పరిస్థితి గురించి నందమూరి, తెలుగుదేశం అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.
తారకరత్నను అవసరమైతే విదేశాలకు తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్రకారం.. విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించారట.
చికిత్సకు అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో పేరుపడ్డ వైద్య నిపుణులనే ఇక్కడికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. గుండె, ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ.. మెదడు దెబ్బ తినడం తారకరత్నకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దాదాపుగా అతను కోమా స్థితికి దగ్గరగా వెళ్లినట్లు చెబుతున్నారు.
బ్రెయిన్ రికవరీ చేసి సాధారణ స్థితికి తేవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో అత్యాధునికి చికిత్సా పద్ధతులను అనుసరిస్తున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates