నందమూరి అంటే మాస్ ఉండాల్సిందే

టాలీవుడ్లో ‘మాస్’ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనదగ్గ ఫ్యామిలీ నందమూరి వారిదే. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణికాలు, జానపదాల తర్వాత చేసిన సినిమాల్లో ఎక్కువ మాస్ చిత్రాలే ఉండేవి. ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా మాస్ సినిమాలతోనే పెద్ద హీర అయ్యాడు. ఇప్పటికీ ఎక్కువగా బాలయ్య మాస్ సినిమాలే చేస్తుంటాడు. కథలో అంత కొత్తదనం లేకపోయినా సరే.. మాస్ టచ్ ఉండి, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఉంటే బాలయ్య సినిమాలు బాగా ఆడేస్తుంటాయి.

తర్వాతి తరంలో జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం మాస్ సినిమాలే బాగా కలిసొచ్చాయి. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ అయినా అంతే. అతనొక్కడే, పటాస్, బింబిసార.. ఇలా కళ్యాణ్ రామ్ కెరీర్లో మాస్ సినిమాలే పెద్ద హిట్లయ్యాయి. వాటికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ‘బింబిసార’లో ఫాంటసీ టచ్ ఉన్నప్పటికీ అది కూడా మాస్ సినిమానే.

కళ్యాణ్ రామ్ కెరీర్లో క్లాస్ సినిమాల్లో హిట్టయింది అంటే ‘118’ మాత్రమే. కానీ ఆ చిత్రం కూడా మరీ ఎక్కువ వసూళ్లేమీ రాబట్టలేదు. సినిమాలో ఉన్న కంటెంట్‌తో పోలిస్తే వసూళ్లు తక్కువే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘అమిగోస్’ క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. దీనికి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తేనే ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ఏపాటిదో అర్థమైపోతుంది.

‘బింబిసార’ సినిమా కోసం ఎగబడి టికెట్లు కొనడంతో ఆ చిత్రం తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ చిత్రానికి వచ్చిన దాంట్లో తొలి రోజు సగం కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది ‘అమిగోస్’. అంటే నందమూరి సినిమాలంటే ఎగబడే మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదన్నమాట. కళ్యాణ్ రామ్ ప్రయోగాలు, కొత్త తరహా సినిమాలు చేయొద్దని కాదు కానీ.. వాటిలోనూ మాస్ టచ్ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఇకపై అతను కొంచెం జాగ్రత్త వహించాల్సిందే.