మాములుగా బాలకృష్ణ పిలిచిన అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లరనే సంగతి తెలిసిందే. తనకు ఆత్మీయులు లేదా పిలవడంలో ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటే తప్ప ఎస్ చెప్పరు. శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో బాలయ్యకు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది.
ఇటీవలే తారకరత్న బెంగళూరు హాస్పిటల్ లో చేరినప్పుడు అదే పనిగా వచ్చి మరీ శివన్న సంఘీభావం తెలిపారు. కేవలం ఈ కారణంగానే ఎన్నడూ లేనిది ఒక డబ్బింగ్ మూవీ శివ వేద ఈవెంట్ కి బాలకృష్ణ హాజరయ్యారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుక గ్రాండ్ గా నిర్వహించి జనం దృష్టిలో పడేలా చేశారు.
కన్నడలో మంచి విజయం సాధించిన వేదని అమిగోస్ ఉన్న కారణంగా ఒక రోజు ముందు 9న థియేటర్లలో విడుదల చేశారు. కట్ చేస్తే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు అంతగా ఆసక్తి కనబరచలేదు.
ఎందుకంటే 10న జీ5లో తెలుగు ఆడియోతో పాటు వేద ఓటిటి వెర్షన్ ముందే ప్రకటించారు కాబట్టి. అన్నట్టుగానే నిన్న అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలైపోయింది. అంటే ఏపీ తెలంగాణలో నాలుగు షోలు పూర్తి చేసుకుని మరుసటి రోజు అయిదో ఆట పడేలోపు డిజిటల్ ప్రీమియర్ జరిగిన మొదటి సినిమాగా వేదను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే ఆలస్యం అలసత్వం వల్ల బాలయ్య రాక, అంతో ఇంతో విషయమున్న డీసెంట్ కంటెంట్ ను చేతులారా వృథా చేసుకుంది ప్రొడక్షన్ టీమ్. ఇదే థియేట్రికల్ రిలీజ్ ఓ రెండు మూడు వారాల ముందు చేసి ఉంటే కనీస ఫలితం దక్కేది. ఇప్పుడది జరగదు.
రివ్యూలు, పబ్లిక్ టాక్ సంగతేమో కానీ శివరాజ్ కుమార్ అంతకష్టపడి సిటీలో ఉండి ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆఖరికి ఓటిటికి ఉపయోగపడేలా ఉన్నాయి. బహుశా ఈయనకు బాలయ్యకు కూడా ఇది ఒక్క రోజు గ్యాప్ లో ఓటిటి వస్తోందన్న సంగతి తెలిసి ఉండదు కాబోలు. ప్లానింగ్ లేకపోతే అంతే మరి