ఆస్కార్ గెలుపుకు ముందస్తు సంకేతాలు

ఏమో కోరుకున్న అద్భుతం సాక్షాత్కారం అయ్యేలా ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. గోల్డెన్ గ్లోబ్ సాధించి ఆస్కార్ కి నామినేట్ అయ్యాక నాటు నాటు పాటమీద అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. షారుఖ్ ఖాన్ రెహమాన్ లతో మొదలుపెట్టి సగటు సినిమా ప్రియుల దాకా అందరూ ఈ కల నిజమవ్వాలని మనసారా కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే అవార్డు సెర్మనీకి రావాల్సిందిగా అకాడెమి నుంచి అధికారిక ఆహ్వానం రావడంతో సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో పాటు గీత రచయిత చంద్రబోస్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ ఘనత సాధించిన తొలి తెలుగు భారతీయులు వీళ్ళే. అదే వేదిక మీద కీరవాణి లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఆస్కార్ సభ్యులు కొరారట. మాములుగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటేనే ఇలా ముందస్తు ప్రణాళికకు సిద్ధం కమ్మంటారు. మరోవైపు చరణ్, తారక్ లతో మొదలుపెట్టి ఫ్రెష్ గా స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేయబోతున్నారు. విపరీతమైన పోటీ నెలకొన్నప్పటికీ మిగిలిన వాటితో పోలిస్తే నాటునాటుకి దక్కిన వరల్డ్ వైడ్ రీచ్ చాలా ఎక్కువ. బాష అర్థం కాకపోయినా విదేశీయులు ఈ సాంగ్ కి ఊగిపోయారు.

ఐమ్యాక్స్ థియేటర్లలో స్క్రీన్ల ముందుకు వెళ్లి డాన్సులు చేశారు. ఇప్పటికీ జపాన్, యుఎస్ లో చాలా ప్రీమియర్లు యాభై శాతం పైగా ఆడియన్స్ తో ఫుల్ అవుతున్నాయి. ఆస్కార్ వేడుక మార్చ్ 12న ఆదివారం జరగనుంది. ఈసారి మన దేశం నుంచి అత్యధిక లైవ్ వ్యూయర్ షిప్ ఉండబోతోంది. దానికి కారణం ఆర్ఆర్ఆరేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ నిజంగా ఈ ఘనత సాధిస్తే మాత్రం దాన్నో సంబరంగా జరుపుకునేందుకు రాజమౌళి బృందం రెడీ అవుతోంది. సన్మానాలు సంబరాలతో కీరవాణి మునిగి తేలడం ఖాయంగా కనిపిస్తోంది. జరగాలనే కోరుకుందాం.