బాహుబలినే కొట్టేసిన పఠాన్

ఇండియన్ ఫిలిం హిస్టరీలో ‘బాహుబలి: ది కంక్లూజన్’కి సంబంధించిన సంచలనాలన్నింటినీ ఒక ప్రత్యేక అధ్యాయంగా పేర్కొనవచ్చు. ఆ సినిమాకు వచ్చిన హైప్, దానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజ్‌కి ముందు-తర్వాత టికెట్ల కోసం నెలకొన్న డిమాండ్, వసూళ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ నభూతో అనిపించే రికార్డులను నమోదు చేసిందా చిత్రం. సమీప భవిష్యత్తులో ఆ సినిమా రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేని పరిస్థితి నెలకొంది.

ఐతే టికెట్ల ధరలు పెరగడం వల్ల బాహుబలి-2 రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. కానీ ఆ సినిమా చూసిన జనాల సంఖ్య విషయంలో మాత్రం చాలా చోట్ల రికార్డులు పదిలంగా ఉన్నాయి. కానీ ‘పఠాన్’ అనే మామూలు సినిమాతో షారుఖ్ ఖాన్ యుఎస్‌లో ‘బాహుబలి-2’ ఫుట్ ఫాల్స్ రికార్డును బద్దలు కొట్టేయడం విశేషం. బాహుబలి-2 యుఎస్‌లో 2.12 మిలియన్ ఫుట్ ఫాల్స్‌తో నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది.

‘పఠాన్’ ఇప్పుడు ఆ రికార్డును దాటేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ వసూళ్లలో ‘పఠాన్’కు, ‘బాహుబలి-2’కు అంతరం చాలానే ఉంది. షారుఖ్ సినిమా 14.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయగా.. ‘బాహుబలి-2’ లెక్క 20 మిలియన్ డాలర్లకు పైగానే ఉంది. ‘బాహుబలి’కి సగటున 25 డాలర్లతో టికెట్లు అమ్మారు. కానీ ‘పఠాన్’ యావరేజ్ టికెట్ రేటు 12 డాలర్లే. హిందీ సినిమాలన్నీ కూడా దాదాపు ఈ రేటుతోనే రిలీజవుతుంటాయి.

తెలుగు సినిమాలకే అక్కడ డిమాండ్ బాగా ఉండడం వల్ల టికెట్ల ధరలు ఎక్కువ పెడుతుంటారు. టికెట్ రేటు తక్కువ కావడం వల్ల ‘పఠాన్’ వసూళ్లలో ఆల్ టైం రికార్డును కొట్టలేదు కానీ.. లేదంటే ఇదే నంబర్ వన్ అయి ఉండేది. ‘బాహుబలి-2’తో పోలిస్తే వీక్ కంటెంట్ ఉన్నప్పటికీ ఇన్ని ఫుట్ ఫాల్స్, ఇంత వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే. వరల్డ్ వైడ్ ఈ చిత్ర వసూళ్లు రూ.850 కోట్ల మార్కును దాటేయడం విశేషం.