బాలయ్య వివాదానికి అరవింద్ సమాధానం ?

ఏదో ప్రత్యేక కారణం లేనిదే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కి పిలవరు. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్, ఇంటర్వ్యూలు గట్రా రెగ్యులర్ గా ఇచ్చేవాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వడం లాంటివి అరుదు. కానీ ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడేందుకు పిలుపు రావడంతో అదేమయ్యి ఉంటుందనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దగా వివాదాలు లేవు. అంత చెప్పుకునే ఇష్యూస్ కనిపించడం లేదు. సంక్రాంతి థియేటర్ల గొడవలో చిరంజీవి వాల్తేరు వీరయ్య ఉన్నా సరే సైలెంట్ గా ఉన్న అల్లు అరవింద్ ఇప్పుడు హఠాత్తుగా దేని గురించి చెప్పబోతున్నారన్న ఆసక్తి కలగడం సహజం.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ఇటీవలే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నర్సులను ఉద్దేశించి అన్న కామెంట్ మీద చెలరేగిన వివాదం గురించట. పవన్ తో తన అనుభవాన్ని పంచుకుంటూ నిజాం కాలేజీ నాటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. బైక్ మీద వెళ్తూ ఓ రోజు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ కు వెళ్ళాక కాలు జారి పడ్డానని అబద్దం చెప్పి, తీరా నర్సు అందంగా ఉండటం చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోయానని అన్నారు. నిజానికిది సినిమాటిక్ స్టయిల్ లో అన్నదే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదనేది అక్కడ కనిపిస్తుంది. అయితే నర్సుల సంఘాలు ఈ వ్యాఖ్య మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఆహాలో స్ట్రీమ్ అవుతున్న వాటిలో టాప్ ప్రోగ్రాం కావడంతో అరవింద్ దీని గురించే వివరణ ఇవ్వొచ్చని వినికిడి. సహజంగా తెరమీద నర్సులనే కాదు లెక్చరర్లను డాక్టర్లను లాయర్లను వ్యంగ్యంగా వెటకారం చేయడం సహజమే. ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఆ టైపు ఫ్లోలో బాలయ్య అన్న మాటలే తప్ప ఏదో నర్సులను లక్ష్యంగా పెట్టుకుని ఆయన ఎందుకు అంటారనే వెర్షన్ ఇవాళ చెప్పే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా వేరేది ఏదైనా అయితే షాకే. ఆ మధ్య అక్కినేని మీద, అంతకు ముందు ఓ బ్రాహ్మణ వర్గం మీద అన్న మాటల మీద రాద్ధాంతం జరగడం చూశాం. ఇప్పుడు నర్సుల వంతు వచ్చింది.