పాపం భానుప్రియ

తెలుగు సినిమా చరిత్రలో భానుప్రియది ఒక ప్రత్యేక అధ్యాయం. 80వ దశకంలో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో ఆమె ఒకరు. అందం, అభినయం, అద్భుత నృత్య ప్రతిభతో ఆమె తనదైన ముద్ర వేసింది. స్వర్ణకమలం, అన్వేషణ లాంటి సినిమాల్లో ఆమె పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ రోల్స్ లోకి మారిన భానుప్రియ.. కొన్నేళ్ల తర్వాత తల్లి పాత్రలు కూడా చాలానే చేశారు.

‘ఛత్రపతి’ లాంటి సినిమాల్లో తల్లి పాత్రల్ని ఆమె ఎంత గొప్పగా పండించారో తెలిసిందే. ఐతే కొన్నేళ్లుగా ఆమె లైమ్ లైట్లో లేరు. సినిమాలకు దాదాపు దూరం అయినట్లే కనిపిస్తున్నారు. కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అభిమానులకు షాకిచ్చారు.

ఆరోగ్యం దెబ్బ తిని గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన భానుప్రియ.. తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించి అభిమానులకు వేదన కలిగించారు. ఆమె క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోతోందట. ఈ సమస్య వల్ల సినిమాల్లో డైలాగులు చెప్పలేక ఇబ్బంది పడినట్లు, డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

“మా వారికి నాకు గొడవ జరిగి విడాకులు తీసుకున్నట్లు మీడియాలో కొన్నేళ్ల ముందు వార్తలు వచ్చాయి. అది అబద్ధం. మా మధ్య ఏ సమస్యలు లేవు. ఆయన అనారోగ్యం వల్ల కొన్నేళ్ల కిందట మరణించారు. ఆ తర్వాత నాకు జ్ఞాపక శక్తి తగ్గడం మొదలైంది. నృత్యానికి సంబంధించి హస్త ముద్రలు కూడా మరిచిపోయాను. ఆ మధ్య ఒక తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మరిచిపోయా. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంత బాగా లేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచనను కూడా అందుకే విరమించుకున్నా. ప్రస్తుతానికి మందులు తీసుకుని కోలుకునే ప్రయత్నం చేస్తున్నా” అని భానుప్రియ తెలిపారు.