అంతటి దిగ్గజానికి ఈ దుస్థితి ఏంటో?

భారతీయ సినిమా పాటను అత్యున్నత శిఖరాలకు చేర్చిన గాయనుల్లో ఒకరు వాణీ జయరాం. అమృతం గొంతులో నింపుకున్నట్లుగా తన గానంతో ఆమె సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 19 భాషల్లో 11 వేల పాటలు పాడిన అరుదైన గాయని ఆమె. ఇటీవలే ఆమెను భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ కూడా వరించింది. ఆమె అభిమానులకు అమితానందాన్ని అందించిన విషయమిది.

ఐతే ఆ పురస్కారం అందుకున్న సమయంలో ఆరోగ్యంగానే కనిపించిన వాణీ జయరాం.. కొన్ని రోజులకే ఇలా కన్నుమూయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆది సహజ మరణం కాదని స్పష్టమవుతోంది. ఆమె ఏ స్థితిలో మరణించిందో తెలుసుకుని అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతటి దిగ్గజ గాయనికి ఈ దుస్థితి ఏంటా అని మథన పడుతున్నారు.

వాణీ జయరాంకు పిల్లలు లేరు. ఆమె భర్త ఐదేళ్ల కిందట మరణించారు. ఒకప్పుడు వెలుగు జిలుగుల జీవితం చూసిన ఆమె కొన్నేళ్ల నుంచి ఆదరించేవారు లేక చెన్నైలోని తన ఇంటిలో ఒంటరి జీవితం గడుపుతున్న విషయం మరణించాకే చాలామందికి తెలిసింది. ఒక పనిమనిషి మినహా ఆమెను చూసుకోవడానికి సొంత వాళ్లంటూ ఎవరూ లేరట.

78 వయసులో ఒంటరి జీవనం గడుపుతూ అనుకోకుండా ఇంట్లో కింద పడడం.. గ్లాస్ టేబుల్ తగిలి గాయం కావడం ఆమె మరణానికి దారి తీసింది. గాయపడ్డపుడు సమయానికి ఇంట్లో పని మనిషి కూడా లేకపోవడంతో సాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం అరణ్య రోదనే అయింది. చివరికి అలాగే ఆమె కన్ను మూసింది. రక్తసిక్తమైన ఆమె పార్థివ దేహాన్ని పోలీసులు బెడ్ షీట్‌లో చుట్టి తీసుకురావాల్సిన పరిస్థితి తెలిసింది. ఇదంతా తెలుసుకున్న అభిమానులు ఈ మధుర గాయనికి చివరికి ఇలాంటి పరిస్థితి తలెత్తిందేంటని వేదనకు గురవుతున్నారు.