తమిళోళ్లు కాపాడతారనుకుంటే ఇంకా తొక్కేశారు

‘ప్రస్థానం’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌తో నటుడిగా పరిచయం అయ్యాడు సందీప్ కిషన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మేనల్లుడైన ఈ కుర్రాడు తొలి చిత్రంతోనే బలమైన ముద్ర వేశాడు. ఆ సినిమాలో సాయికుమార్, శర్వానంద్‌ల పెర్ఫామెన్స్‌కు ఎంత ప్రశంసలు లభించాయో సందీప్ నటనకు కూడా అలాంటి ప్రశంసలే వచ్చాయి.

ఆ తర్వాత హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సూపర్ హిట్ కొట్టి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్. చాలా ప్రామిసింగ్‌గా కనిపించిన అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు పోటీ పడ్డారు. ఐతే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత తెలుగులో ఆ స్థాయి హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేకపోయాడతను. రకరకాల జానర్లలో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టైగర్, నిను వదలని నీడను నేనే లాంటి సినిమాలు సేఫ్ వెంచర్లు అయ్యాయే తప్ప నిఖార్సయిన హిట్ మాత్రం కాలేదు.

తెలుగులో అంతకంతకూ సందీప్ కెరీర్ దిగజారుతూ వచ్చింది. అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసింది. ఐతే తమిళంలో మాత్రం సందీప్‌కు కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తొలి చిత్రం ‘మానగరం’లో సందీపే హీరో. ఆ సినిమాతో పాటు మాయవన్, కసాట డబారా లాంటి సినిమాలు కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి.

సందీప్‌కు మంచి పేరు కూడా తెచ్చాయి. ఇప్పుడతను ‘మైకేల్’ అనే పెద్ద రేంజ్ సినిమా చేశాడు తమిళంలో. ఈ సినిమా ప్రోమోలు చూసి జనాలు ఏదో అనుకున్నారు. సందీప్ కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగేలా ఉందని, అటు తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోవడం పక్కా అని అంచనాలు కట్టారు. ఐతే తీరా సినిమా చూస్తే తుస్సుమనిపించేసింది.

‘కేజీఎఫ్’కు అనుకరించబోయి బోల్తా కొట్టేసింది ‘మైకేల్’ టీం. బిల్డప్ తప్పితే సినిమాలో విషయం లేదని ఇటు క్రిటిక్స్, అటు ప్రేక్షకులు తేల్చేశారు. సందీప్ గత సినిమాల ప్రభావంతో ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. టాక్ బాలేకపోవడంతో సినిమా ఏ దశలోనూ పైకి లేవలేదు. తెలుగులో దాదాపుగా వాషౌట్ అయిపోయింది. తమిళంలో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. మొత్తానికి తమిళోళ్లయినా సందీప్‌ను పైకి లేపుతారేమో అనుకుంటే అతణ్ని ఇంకా కిందికి తొక్కేయడం విచారకరం.