ప్రేమదేశం టైటిల్ వాడుకున్నారు కానీ

ఇప్పటి టీనేజ్ యూత్ కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రేమదేశం అంటే 90స్ యూత్ కి ఒకరకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. వినీత్ అబ్బాస్ హీరోలుగా టబు హీరోయిన్ గా వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాములు బ్లాక్ బస్టర్ కాదు. ఇద్దరు కుర్రాళ్ళ మీద నిర్మాత కెటి కుంజుమోన్ కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం అప్పట్లో సెన్సేషన్. దానికి తగ్గట్టే గొప్ప ఫలితం అందుకుంది. అలాంటి క్లాసిక్ టైటిల్ ని పెట్టుకుని నిన్నో సినిమా రిలీజైన విషయం సాధారణ ప్రేక్షకులకు తెలియనంత సైలెంట్ గా వచ్చేసింది. రైటర్ పద్మభూషణ్, మైఖేల్ తప్ప దేని మీద ఫోకస్ లేకపోవడంతో వచ్చిన తిప్పలిది.

సరే పేరు క్లాసిక్ ది వాడుకున్నారు మరి కంటెంట్ ఎలా ఉందంటే దాని పరువు కాస్తా తీసేలా సాగింది. అలా అని ఇందులో ముక్కుమొహం తెలియని క్యాస్టింగ్ ఉందనుకుంటే పొరపాటే. త్రిగున్, మేఘ ఆకాష్, వైవా హర్ష, తనికెళ్ళ భరణి ఇలా మంచి తారాగణం పెట్టుకున్నారు. రెండు ప్రేమకథలను సమాంతరంగా చెబుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ ని ముడిపెడుతూ దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ వ్యవహారం మొత్తం రొటీన్ గా సాగడంతో టైటిల్ కార్డు నుంచి చివరిదాకా ప్రేమదేశం అనాసక్తిగా సాగుతుంది. కథనంలోని విపరీతమైన నెమ్మదితనం ఓపికకు పరీక్ష పెడుతుంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సైతం ఇలాంటి అవుట్ ఫుట్ కి న్యాయం చేయలేకపోయారు. ఒక్క పాట మినహాయించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహా మిగిలినదంతా ఏదీ ఆయన స్థాయిలో లేదు. త్రిగున్, మేఘ ఆకాష్ లు బాగానే నటించినప్పటికీ వాళ్ళ పెర్ఫార్మన్స్ ని వాడుకునేలా స్క్రీన్ ప్లేలో మేజిక్ లేదు. మొత్తానికి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి అంతే మౌనంగా వెళ్లిపోయేలా ప్రేమదేశం ఒక టైటిల్ ని వృధా చేయడం మినహాయించి చేసిందేమీ లేదు. గతంలో శంకరాభరణం, అప్పు చేసి పప్పు కూడు లాంటి మంచి టైటిల్స్ సైతం ఇలాగే బ్యాడ్ కంటెంట్ తో బోల్తా కొట్టాయి. ప్రేమదేశం వాటి సరసనే చేరింది.