బాలయ్య చురుకు పవన్ సిగ్గు భలే కుదిరాయి

మోస్ట్ వాంటెడ్ టాక్ షోగా రెండు సీజన్లలోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది. క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకురావడంతో ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. ఊళ్ళలో కటవుట్లు పెట్టడం, స్ట్రీమింగ్ తొమ్మిది గంటలకైతే సాయంత్రం ఏడుకే ప్రసాద్ ల్యాబ్స్ లో ఫ్యాన్స్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ప్రభాస్ భాగం వచ్చినప్పుడు యాప్ క్రాష్ అయిన నేపథ్యంలో అలాంటివి జరగకుండా ఆహా టీమ్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈసారి ప్రసారానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.

అంచనాలకు తగ్గట్టుగానే బాలయ్య పవన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. స్వతహాగా ఇలాంటి వాటిలో మహా సిగ్గరి అయిన పవన్ తో మాట్లాడించేందుకు బాలకృష్ణ చూపించిన హుషారు అభిమానులను ఆకట్టుకుంది. పవనేశ్వరా భయ్యా అంటూ సంబోధించడం, వ్యక్తిత్వం గురించి వివరిస్తూ సుభాష్ చంద్రబోస్ లక్షణాలు ఉన్నాయంటూ పొగడటం, భీమ్లా నాయక్ కు కొమరం భీమ్ స్వాగతం అంటూ తాను ఆ గెటప్ లో ఉన్న స్టిల్ ని చూపించడం బాగా వచ్చాయి. ఇద్దరు మొదటిసారి కలుసుకున్న సుస్వాగతం ఓపెనింగ్ తో పాటు కాకతీయ గ్రాండ్ లో చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కల్మషం లేని వ్యక్తిత్వమంటూ బాలయ్య మీద పవన్ ప్రశంసల వర్షం కురిపించారు.

వ్యవసాయం, ఫార్మ్ హౌస్, త్రివిక్రమ్ తో స్నేహం, అతడు కథ చెబుతున్నప్పుడు నిద్రపోవడం గురించి ఇద్దరి మధ్య ఇప్పటికీ ఆర్గుమెంట్లు జరగడం వగైరా అన్నీ ప్రస్తావనకు వచ్చాయి. రాజకీయాలకు సంబందించిన టాపిక్ కూడా కాసింత వాడిగా జరిగింది. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఇకపై ఎవరు మాట్లాడినా ఊరకుక్కతో సమానమంటూ బాలయ్య చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఒకేసారి తాను మూడు పెళ్లిళ్లు చేసుకోలేదంటూ పవన్ ఇచ్చిన వివరణతో పూర్తి సంతృప్తి చెందిన బాలయ్య స్పందన అది. మొత్తానికి స్క్రీన్ మీద బాలయ్య పవన్ బంధం కనువిందుగా నడించింది.