మొదటిసారి పవన్ సినిమాకి ఇంగ్లీష్ టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కాంబోలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ ఇవాళ పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఉదయం పరిమితంగా పిలిచిన అతిధులుతో మంచి స్టైలిష్ అవుట్ ఫిట్ తో పవన్ రాగా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి అతిరధ మహారథుల మధ్య నిర్మాత డివివి దానయ్య ప్రారంభోత్సవం గ్రాండ్ గా చేశారు. అయితే క్లాప్ బోర్డు మీద ‘దే కాల్ హిం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అని ఉంది. గతంలో పోస్టర్ వదిలినప్పుడు ఇదేదో ట్యాగ్ లైన్ అనుకున్నారు కానీ తీరా చూస్తే ఇదే టైటిల్ గా లాక్ చేసే అవకాశాలున్నాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

ఒకవేళ అదే నిజమైతే ఇలాంటి పెద్ద ఇంగ్లీష్ పేరు మాస్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే. అయితే ఫ్యాన్స్ OG షార్ట్ ఫార్మ్ ని ట్రెండ్ చేయడంతో క్రమంగా ఇదే అలవాటు అయ్యేలా ఉంది. కథకు సంబంధించిన లీక్స్ గురించి నిన్నంతా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. పాటలు ఫైట్లు ఉండవని, పవన్ పాత్ర గంటలోపే ఉండేలా సుజిత్ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఏదేదో ప్రచారం జరిగింది. ఇవెంత వరకు నిజమో రిలీజయ్యాక కానీ చెప్పలేం. మీడియాని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు కాబట్టి ప్రెస్ మీట్ ద్వారా అడిగే ఛాన్స్ లేకుండా పోయింది ఇప్పటిదాకా పవన్ ఏ సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ పెట్టలేదు.

సంగీత దర్శకుడిగా పవన్ తో తమన్ ముచ్చటగా మూడో ఛాన్స్ కొట్టేశాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు రీమేకుల తర్వాత వరసగా వచ్చిన ఆఫర్ ఇది. సాంగ్స్ లేకపోతే మటుకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాల్సి ఉంటుంది. అనిరుద్ రవిచందర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు విఫలమైనందుకే మళ్ళీ తమన్ వైపు మొగ్గు చూపారని వినికిడి. అయినా ఇప్పుడున్న టాలీవుడ్ ఆప్షన్లలో అయితే తమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ తప్ప స్టార్ హీరోలకు ఇంకో ఛాయస్ లేకుండా పోయింది. దీనికి తోడు త్రివిక్రమ్ రికమండేషన్ బలంగా పని చేసిందనే న్యూస్ కూడా ఉంది. హీరోయిన్ ఇతరత్రా ఇంకా తెలియాల్సి ఉంది.