మళ్లీ పాత చరణ్ కనిపిస్తున్నాడే..

కెరీర్ ఆరంభంలోనే ‘మగధీర’ రూపంలో ఇండస్ట్రీ హిట్ కొట్టి పెద్ద రేంజికి వెళ్లిపోయాడు రామ్ చరణ్. ఆ తర్వాత ‘ఆరెంజ్’ రూపంలో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ.. మళ్లీ పుంజుకుని రచ్చ, నాయక్ లాంటి హిట్లు ఇచ్చాడు. తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాక రామ్ చరణ్ మాటతీరు, ప్రవర్తన ఒక టైంలో కొంచెం వివాదాస్పదంగా మారింది. ‘నాయక్’ సినిమా వేడుకలో మాట్లాడుతూ ‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ చరణ్ చేసిన కామెంట్ మీద విమర్శలు వచ్చాయి.

అలాగే హైదరాబాద్‌‌లోని జూబ్లీ హిల్స్‌లో రోడ్డు మీద జరిగిన ఒక గొడవ విషయంలోనూ చరణ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ టైంలో అతడికి యాటిట్యూడ్ ఎక్కువైందంటూ సోషల్ మీడియాలో బాగా రచ్చ జరిగింది. ఐతే ఎవరైనా చెప్పారా.. లేదంటే తనే మారాడా అన్నది తెలియదు కానీ.. చరణ్‌లో తర్వాత స్పష్టమైన మార్పు కనిపించింది. వేదికల మీద మాట్లాడేటపుడు జాగ్రత్తగా, హుందాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.

‘రంగస్థలం’ రూపంలో నాన్-బాహుబలి హిట్ కొట్టాక కూడా చరణ్‌లో కాస్త కూడా గర్వం కనిపించలేదు. చాలా అణకువతో కనిపించాడు. మాటల్లో, ప్రవర్తనలో ఎంతో పరిణతి కనిపించింది. ఐతే ఇప్పుడేదో అహంకారం తలకెక్కేసిందని కాదు కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ వేడుకలో చరణ్ మాటతీరు మాత్రం కొంచెం పాత ఛాయలు కనిపించాయి.

తనకంటే వయసులో చాలా పెద్దవాడైన రవితేజను ‘రవి’ అని పేరు పెట్టి పలుమార్లు సంబోధించడం.. అన్నా, గారు లాంటి పదాలేమీ వాడకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీని మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే చూస్తూ ఊరుకోమంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించాడు చరణ్. ఈ వార్నింగ్ చూశాక అందరికీ ‘వెంట్రుక కూడా పీకలేరు’ డైలాగ్ గుర్తుకొచ్చింది. అప్పట్లా అమర్యాదకరమైన మాట వాడలేదు కానీ.. వేదిక మీది నుంచి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

ఇదిలా ఉండగా.. ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్ని చూసి నేర్చుకోవాలంటూ పరోక్షంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు చరణ్ కౌంటర్ వేయడం గమనార్హం. మొత్తంగా చూస్తే గత కొన్నేళ్లలో ఎంతో మారినట్లు కనిపించిన చరణ్‌.. మళ్లీ ఇప్పుడు పాత ఛాయలు చూపిస్తున్నాడేంటి అనే చర్చ నడుస్తోంది.