ఆ స్టార్ హీరోకు, తండ్రికి మాటల్లేవట


తమిళంలో ప్రస్తుతం విజయే నంబర్ వన్ హీరో అంటే దిల్ రాజును రజినీకాంత్, అజిత్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు కానీ.. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు బాక్సాఫీస్ నంబర్లే నిదర్శనం. విజయ్ సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా కొన్నేళ్ల నుంచి భారీ వసూళ్లే వస్తున్నాయి. తాజాగా ‘వారిసు’ కూడా డివైడ్ టాక్‌తోనే భారీ కలెక్షన్లే రాబట్టింది.

ఐతే కెరీర్ పరంగా పీక్స్‌ను చూస్తున్న విజయ్ కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఈ మధ్య తరచుగా వార్తలు వస్తున్నాయి. తన భార్య నుంచి విజయ్ విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఒక రూమర్ హల్‌చల్ చేసింది. దీనికి సంబంధించి తర్వాత అప్‌డేట్స్ ఏమీ లేకపోవడంతో ఇది జస్ట్ రూమర్‌గానే భావిస్తున్నారు ప్రస్తుతానికి. మరోవైపు తన తండ్రి చంద్రశేఖర్‌తో విజయ్‌కి అస్సలు పడట్లేదని కొన్నేళ్ల నుంచే వార్తలు వస్తున్నాయి. తన తండ్రికి వ్యతిరేకంగా ఒక దశలో విజయ్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లిన మాట వాస్తవం.

ఐతే కొడుకుతో విభేదాలపై నటుడు, దర్శకుడు అయిన చంద్రశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కు, తనకు కొన్ని మనస్ఫర్థలు ఉన్న మాట వాస్తవమే అని ఆయన చెప్పాడు. తామిద్దరం దాదాపు ఏడాదిన్నరగా మాట్లాడుకోవట్లేదని ఆయన అంగీకరించారు. ఐతే కుటుంబం అన్నాక కొన్ని గొడవలు సహజమని.. తనకు, విజయ్‌కి మధ్య కూడా కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని.. తామిద్దరం సరిగా మాట్లాడుకోలేకపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని ఊహించుకోవాల్సిన అవసరం లేదని.. ఇటీవల తమ కుటుంబ సభ్యులంతా కలిసి ‘వారిసు’ సినిమా కూడా చూశామని ఆయన వెల్లడించారు.

విజయ్ తన ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి రావాలన్నది చంద్రశేఖ్ ఆకాంక్ష. అభిమానుల కోరిక కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన పొలిటికల్ మీటింగ్స్ పెట్టడం.. అభిమానులకు విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మెసేజ్‌లు పంపడం ఒక టైంలో వివాదానికి దారి తీసింది. ఆ టైంలోనే విజయ్ తండ్రితో విభేదించి.. ఆయనకు వ్యతిరేకంగా అభిమానులకు మెసేజ్‌ ఇచ్చాడు.