‘పఠాన్’ హేటర్స్‌కి పాయింట్లు దొరికేశాయ్

షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ మీద విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు ఎంత ట్రోలింగ్ జరిగిందో, ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఒక వర్గం ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఐతే రిలీజ్ ముంగిట వీళ్లందరూ కూడా సైలెంట్ మోడ్ ‌లోకి వెళ్లిపోయారు. అందుక్కారణం.. సినిమాకు విపరీతమైన హైప్ రావడం, జనాల్లో షారుఖ్ మీద ఒక రకమైన సానుభూతి కలిగి సినిమాకు మద్దతుగా నిలవడం. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూసి బాయ్‌కాట్ బ్యాచ్ బెంబేలెత్తిపోయిందనే చెప్పాలి. దీంతో ఇక లాభం లేదని సైలెంటైపోయారు.

కానీ రిలీజ్ రోజు మళ్లీ ఈ బ్యాచ్ రంగంలోకి దిగింది. అసలీ సినిమానే చూడొద్దని నానా గొడవ చేసిన వాళ్లే సినిమాకు వెళ్లారు. వెళ్లి అందులోని లోపాలను వెతికి వెతికి పట్టుకుని మళ్లీ సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపైనింగ్ మొదలుపెట్టారు.

ఈ చిత్రంలో విలన్ మాజీ సైనికుడు. పరమవీరచక్ర మెడల్ కూడా అందుకుంటాడు. కానీ తనను, తన కుటుంబాన్ని కాపాడ్డానికి సైన్యం సాయం చేయలేదన్న కారణంతో అతను దేశద్రోహిగా మారతాడు. శత్రువులతో చేతులు కలిపి ఇండియా మీద ఎటాక్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. హీరోయినేమో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్. ఆమె ముందు ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలో పాలుపంచుకున్నప్పటికీ.. తర్వాత సామాన్య జనాలకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో హీరోతో చేతులు కలిపి ఇండియాను రక్షించడానికి సాయం చేస్తుంది.

‘పఠాన్’ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న వారికి ఈ రెండు పాత్రల విషయంలో పాయింట్లు దొరికేశాయి. హిందువు అయిన మాజీ సైనికుడిని విలన్‌గా చూపించి.. ముస్లిం, పైగా పాకిస్థానీ అయిన ఐఎస్ఐ ఏజెంట్‌ మన దేశాన్ని కాపాడినట్లు చూపిస్తారా? విలన్‌కి సాయం చేసే పాత్రలో ఒక హిందూ డాక్టర్‌ని చూపిస్తారా? అని ప్రశ్నిస్తూ ‘పఠాన్’ మీద హేట్ మెసేజ్‌ల వర్షం కురిపిస్తున్నారు బాయ్‌కాట్ బ్యాచ్. అంతే కాక ఈ సినిమా థియేటర్లను కూడా అక్కడక్కడా ఎటాక్ చేస్తుండడం గమనార్హం. ‘పఠాన్’ సినిమాను ప్రదర్శిస్తున్న హైదరాబాద్‌లోని తారకరామ థియేటర్‌ భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడికి దిగిన వీడియో వైరల్ అవుతోంది.