ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించేశారు

హీరో ఎలివేష‌న్లు, మాస్ సీన్లు, గూస్ బంప్స్ ఇచ్చే యాక్ష‌న్ సీక్వెన్సుల‌కు సౌత్ సినిమాలే కేరాఫ్ అడ్ర‌స్‌. వాటికి ఇప్పుడు హిందీ ప్రేక్ష‌కులు కూడా బాగా అల‌వాటు ప‌డిపోవ‌డంతో బాలీవుడ్‌కు త‌ల‌నొప్పిగా త‌యారైంది. సౌత్ సినిమాలు ఇస్తున్న మాస్ కిక్ హిందీ సినిమాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో వాటి ప‌ట్ల ఆస‌క్తి కోల్పోతున్నారు అక్క‌డి ప్రేక్ష‌కులు. ఇది గుర్తించే ఈ మ‌ధ్య బాలీవుడ్ ఫిలిం మేక‌ర్లు కూడా మారుతున్నారు.

తాజాగా రిలీజైన ప‌ఠాన్ సినిమా చూస్తే.. బాలీవుడ్ కూడా చాలా మారుతోంద‌ని స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. సిద్దార్థ్ ఆనంద్ ఇంత‌కుముందు తీసిన సినిమాల‌తో పోలిస్తే ఇందులో ఎలివేష‌న్ సీన్లు, యాక్ష‌న్ ఘ‌ట్టాలు వేరే లెవెల్ అని చెప్పాలి. అచ్చంగా సౌత్ ఫార్మాట్‌నే అత‌ను పాలో అయిపోయాడు ఈ చిత్రంలో.

షారుఖ్ ఖాన్‌ను అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేయ‌డం.. సినిమా అంత‌టా అత‌డి పాత్ర‌కు ఎలివేష‌న్ ఇవ్వ‌డం.. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఓవ‌ర్ ద టాప్ స్ట‌యిల్లో చిత్రీక‌రించ‌డం చూస్తే సౌత్ సినిమాల ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. సినిమా అంతా కూడా ఎలివేష‌న్లు, యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తోనే నిండిపోవ‌డంతో షారుఖ్ ఫ్యాన్స్, మాస్ ప్రేక్ష‌కుల‌కు క‌డుపు నిండిపోతోంది. క‌థ వీక్‌గా ఉన్నా చెల్లిపోయింది.

ఇక ఈ సినిమాలో మేజ‌ర్ హైలైట్ అంటే.. షారుఖ్‌ను స‌ల్మాన్ ర‌క్షించి, ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి విల‌న్ల మీద రెచ్చిపోయే ఎపిసోడే. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని వారెవా అనిపించేలా చిత్రీక‌రించారు. అందులో షారుఖ్, స‌ల్మాన్‌ల కాన్వ‌ర్జేష‌న్ భ‌లే స‌ర‌దాగా సాగిపోయింది. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల‌ను దాదాపు ప‌ది నిమిషాలు చూడ‌డం.. వాళ్లిద్ద‌రూ ది బెస్ట్ అనిపించేలా క‌నిపిస్తూ పంచులేస్తూ.. వీర లెవెల్లో యాక్ష‌న్ విందు అందించ‌డంతో హిందీ ఆడియ‌న్స్‌ ఇంత‌కంటే ఏం కావాలి అంటున్నారు.