విక్రమ్ చూపిన దారిలోనే సీనియర్లు

నిన్నటి తరం సీనియర్ స్టార్ హీరోలకు మంచి దశ నడుస్తోంది. న్యూ జెనరేషన్ ప్రేక్షకులను వీళ్ళను ఏ మేరకు రిసీవ్ చేసుకోగలరనే అనుమానాలకు చెక్ పెడుతూ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కమల్ హాసన్ విక్రమ్ సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్, అందులో హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు మిగిలిన దర్శకులకూ స్ఫూర్తినిస్తూ అదే స్టయిల్ ని ఫాలో అయ్యేలా చేస్తోంది. ఆ సినిమాలో కమల్ మెషీన్ గన్ తో చేసిన విన్యాసాలు, మాఫియా గ్యాంగ్ తో తలపడినప్పుడు బులెట్ల వర్షం కురిపిస్తూ సాగించిన రచ్చ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్ లో పేలింది.

ఇటీవలే మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి అచ్చం అదే తరహాలో ప్రీ క్లైమాక్స్ లో విలన్ డెన్ కు వెళ్లి గన్నుతో ఫైరింగ్ చేయడం విక్రమ్ నే తలపించింది. కట్ చేస్తే తాజాగా రిలీజ్ చేసిన వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ లోనూ పెద్ద చాంతాడంత తుపాకీని పట్టించి చాలా కాలం తర్వాత వెంకీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. నాగార్జున సైతం ది ఘోస్ట్ లో ఎన్నిసార్లు ఇలాంటి విధ్వంసం చేశారో చూశాం. అఖండ గుడి ఫైట్ లో గనుల వీరంగం గుర్తేగా. ఈ లెక్కన వయసుతో సంబంధం లేకుండా అగ్రజులను ఇలా చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో ఇలాంటి ఎపిసోడ్స్ బోలెడున్నాయని ఆల్రెడీ టాక్ ఉంది. ఇప్పుడంతా ఎలివేషన్ల జమానా. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యాభై అరవై దాటిన హీరోలతో వింటేజ్ లుక్స్ ని మ్యానరిజంని ట్రై చేస్తున్న యంగ్ డైరెక్టర్లందరూ దాదాపుగా మంచి ఫలితం అందుకుంటున్నారు. దానికి పైన చెప్పినవన్నీ మంచి ఉదాహరణలే. లోకేష్ కనగరాజ్, బాబీ, శైలేష్ కొలను, నెల్సన్ దిలీప్ కుమార్ వీళ్లంతా ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడను తీసుకొస్తూ కమర్షియల్ ఫార్ములాని మార్చి రాస్తున్నారు. వీళ్ళ వల్లే కుర్ర హీరోలు వేగంగా పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది