చేజేతులా ఒక ఆస్కార్‌ను వ‌దులుకున్నామా?

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా త‌న ఉనికిని చాటుకోవ‌డం ఖాయ‌మ‌ని ఎక్కువ‌మంది అంచ‌నా వేశారు. కాక‌పోతే ప‌లు విభాగాల్లో నామినేష‌న్ వ‌స్తుంద‌ని ఆశిస్తే.. ప్ర‌స్తుతానికి ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట‌కు మాత్ర‌మే నామినేష‌న్ ద‌క్కింది.

ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ చిత్రం విభాగాల్లో ఆర్ఆర్ఆర్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. నాటు నాటు పాట‌కు ఇప్ప‌టికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ద‌క్కిన నేప‌థ్యంలో ఆస్కార్ పుర‌స్కారం వ‌చ్చే అవ‌కాశాలు మెండుగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. కాగా ఒక ఆస్కార్ అవార్డును ఇండియా చేజేతులా పోగొట్టుకుంద‌నే చ‌ర్చ ఇప్పుడు న‌డుస్తోంది.

ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్ పోటీ ప‌డి ఉంటే దానికి ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ఇంట‌ర్నేష‌న‌ల్ అప్లాజ్ ప్ర‌కారం చూస్తే క‌చ్చితంగా ఈ విభాగంలో నామినేష‌న్ సంపాదించ‌డ‌మే కాక‌.. అవార్డును కూడా సొంతం చేసుకునేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ విభాగంలో పోటీ కోసం వివిధ దేశాలు త‌మ చిత్రాల‌ను నామినేట్ చేస్తాయి.

ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్‌కే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు కానీ.. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా జ్యూరీ స‌భ్యులు మాత్రం దాన్ని కాద‌ని గుజ‌రాతీ చిత్రం చెల్లే షోను ఎంపిక చేశారు. కానీ ఈ సినిమా ఇప్పుడు క‌నీసం నామినేష‌న్ కూడా సంపాదించ‌లేక‌పోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ బెస్ట్ ఫిలిం అవార్డు ద‌క్కే అవ‌కాశాలు లేవ‌ని ముందే విశ్లేష‌కులు తేల్చేశారు.

కానీ ఇండియా నుంచి నామినేట్ అయి ఉంటే బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం పుర‌స్కారానికి గ‌ట్టి పోటీదారు అయ్యేద‌ని.. క‌చ్చితంగా నామినేష‌న్ సంపాదించేద‌ని, అంతిమంగా విజేత‌గా నిలిచేద‌ని.. కానీ ఆ సినిమాను నామినేట్ చేయ‌క‌పోవ‌డం ద్వారా చేజేతులా ఇండియా ఒక ఆస్కార్ అవార్డును కోల్పోయింది అనే చ‌ర్చ న‌డుస్తోంది సోష‌ల్ మీడియాలో.