ఏది ఏమైనా కానీ.. సలార్ మాత్రం పక్కా

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. కానీ అవి రెండూ తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీని తర్వాత ప్రభాస్ నుంచి రానున్న ‘ఆదిపురుష్’ మీద దాదాపుగా అభిమానులు ఆశలు కోల్పోయారు. టీజర్ అంతగా అంచనాలు తగ్గించేసింది. ప్రస్తుతం సెట్స్ మీద మూడు సినిమాలు ఉండగా.. అందులో మారుతి సినిమా మీదా పెద్దగా అంచనాలు లేవు. ‘ప్రాజెక్ట్-కే’ సినిమా ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ అది పూర్తయి రిలీజ్ కావడానికి చాలా టైం పట్టేలా ఉంది. కాబట్టి దాని రిజల్ట్ గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు.

ఇక మిగిలింది.. సలార్. ప్రభాస్ అభిమానుల్లో అత్యధిక అంచనాలు ఉన్నది, షూటింగ్ జోరుగా జరుపుకుంటున్నది, అలాగే సమీప భవిష్యత్తులో విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది ‘సలార్’యే. ఈ వేసవికే అనుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఐతే ప్రభాస్ కమిట్మెంట్లు పెరిగిపోయాయి. ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ విషయంలో డోలాయమాన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ‘సలార్’ పక్కాగా అనుకున్న తేదీకి వస్తుందా రాదా అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. ఐతే ఈ సందేహాలకు తాత్కాలికంగా తెరదించింది ‘సలార్’ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్. సెప్టెంబరు 28నే ఈ చిత్రం రిలీజవుతుందని ధ్రువీకరిస్తూ.. తాజాగా 250 డేస్ రిలీజ్ కౌంట్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌ను లాంచ్ చేసింది హోంబలె ఫిలిమ్స్. తద్వారా ఈ సినిమా ట్రాక్ మీదే ఉందని.. డెడ్ లైన్‌ను అందుకుంటుందని చెప్పకనే చెప్పింది.

‘ఆదిపురుష్’ సంగతి ఏమైనా.. మారుతి సినిమా ఎప్పటికి రెడీ అయినా.. తమ చిత్రం మాత్రం అనుకున్న తేదీకే వస్తుందని హోంబలె ఫిలిమ్స్ స్పష్టం చేసినట్లు భావిస్తున్నారు. ప్రభాస్‌ నుంచి అభిమానులు అత్యంత ఆశిస్తున్న సినిమా ఇదే కావడంతో రిలీజ్ డేట్ మరోసారి ఖరారరవడంతో చాలా సంతోషంగా ఉన్నారు.