అక్కినేని తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యల దుమారం

నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్నాడంటే చాలు.. అందరూ అలెర్టయిపోతారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అన్నట్లే ఉంటుంది వ్యవహారం. ఎన్నోసార్లు వేదికల మీద బాలయ్య మాట తడబడడం.. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. కొన్నిసార్లు ఏ ఉద్దేశం లేకుండా యధాలాపంగా అన్న మాటలు కూడా వివాదాస్పదం అయ్యాయి.

తాజాగా ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో భాగంగా బాలయ్య ఒక ఫ్లోలో అన్న మాట సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఆయన ఒక చోట.. ‘‘అక్కినేని తొక్కినేని’’ అనే పదప్రయోగం చేయడం వివాదానికి దారి తీసింది. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. ఒకచోట ఒక నటుడిని చూపిస్తూ ఆయనతో జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించాడు బాలయ్య. తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వచ్చాయంటూ నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంతా కూడా.. అంటూ ఏదో మాట్లాడేశాడు బాలయ్య.

పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని పేరెత్తిన బాలయ్య, దాంతో పాటు ‘తొక్కినేని’ అనే మాట వాడడం చర్చనీయాంశంగా మారింది. ఇది అక్కినేని వారిని డీగ్రేడ్ చేయడంలో భాగమే అంటూ బాలయ్యను నెటిజన్లు, అలాగే అక్కినేని అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అక్కినేని ఫ్యామిలీతో ఒకప్పుడు బాలయ్య చాలా సన్నిహితంగానే ఉన్నప్పటికీ.. మధ్యలో ఏమైందో ఏమో ఆ కుటుంబానికి దూరం అయ్యాడు. నాగార్జునతో అయితే బాలయ్యకు చాలా ఏళ్ల నుంచి మాటల్లేవని అంటారు. వీరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో కానీ.. ఇద్దరూ కలిసి, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని చాలా ఏళ్లయిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య ఇలా ‘అక్కినేని తొక్కినేని’ అనే మాట వాడడంతో ఇది ఇరువురి మధ్య విభేదాలకు సూచికగా చెబుతున్నారు. ఎంత ఫ్లోలో మాట్లాడినా కూడా బాలయ్య ఆ మాట ఎలా అంటాడంటూ ఆయన తీరును సోషల్ మీడియా జనాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.