ఏజెంట్ కోసం భోళా శంకర్ సర్దుబాటు

గతంలో ప్రకటించిన భోళా శంకర్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 14లో పెద్ద మార్పే ఉండబోతోంది. ఒక నెల ఆలస్యంగా మే 12న విడుదల చేయాలని టీమ్ నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వాల్తేరు వీరయ్య వచ్చి వంద రోజులు దాటకుండానే చిరంజీవి మరో కొత్త సినిమా థియేటర్లో రావడం అప్పుడెప్పుడో 1990కి ముందు జరిగింది తప్ప అంతకు ముందెప్పుడూ లేదు. సరే ఇదేదో కొత్త రికార్డుగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మళ్ళీ మెగా మాస్ ని తక్కువ గ్యాప్ తో ఎంజాయ్ చేయొచ్చని ఆశపడ్డారు. కానీ జరుగుతుంది వేరు. ఇప్పుడీ షిఫ్ట్ వెనుక అఖిల్ ఏజెంట్ ఉన్నట్టు కొన్ని కీలక పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

ఈ రెండు సినిమాలకు నిర్మాత అనిల్ సుంకరేనన్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ లో కెఎస్ రామారావు భాగస్వామ్యం ఉంది కానీ బిజినెస్ వ్యవహారాల పరంగా ఎవరు హైలైట్ అవుతున్నారో చూస్తున్నాం. ఏజెంట్ ఇప్పటికే విపరీతంగా ఆలస్యం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో దించాలని డిసైడ్ అయ్యారట. దానికి తగ్గట్టు దర్శకుడు సురేందర్ రెడ్డి క్లైమాక్స్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారని తెలిసింది. ట్రైలర్ లాంచ్, లిరికల్ సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చాలా ప్రమోషన్లు మొదలుపెట్టాలి. చేతిలో ఉన్న రెండున్నర నెలలు ప్యాన్ ఇండియా రేంజ్ హైప్ కి వాడుకోవాలి.

భోళా శంకర్ విషయంలో చిరు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. ముందు నుంచి వేదాళం రీమేక్ అనే అంశంతో పాటు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ఒకరకమైన నెగటివిటీని తీసుకొచ్చింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఫలితం చూశాక బాస్ లోని మాస్ ని కామెడీని సరిగ్గా వాడుకుంటే యావరేజ్ కంటెంట్ తో కూడా హిట్ కొట్టొచ్చని ఋజువైపోయింది. సహజంగానే భోళా శంకర్ లో ఉన్న ఊర కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈజీగా ఆడేసుకోవచ్చు. మొత్తానికి ఏజెంట్ కోసం భోళా శంకర్ సర్దుబాటు బాగానే ఉంది కానీ అఖిల్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఫ్యాన్స్ కోరిక నెరవేరాలి మరి.