‘వీరసింహారెడ్డి’ కన్నా ‘వారసుడు’కు ఎక్కువ

సంక్రాంతి సినిమాల విడుదలకు చాలా రోజుల ముందు నుంచే థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి రెండు పెద్ద సినిమాలు ఉండగా.. వాటికి దీటుగా డబ్బింగ్ మూవీ అయిన ‘వారసుడు’కు దిల్ రాజు థియేటర్లు అట్టి పెట్టడం మీద చాలా రోజుల పాటు చర్చ నడిచింది. చివరికి తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. తన సినిమాను ముందు అనుకున్న ప్రకారం 11న రిలీజ్ చేయకుండా ఆపుకొన్నాడు రాజు. మూడు రోజులు ఆలస్యంగా 14న ‘వారసుడు’ను రిలీజ్ చేశాడు.

ఇదంతా చిరు, బాలయ్యల మీద.. తెలుగు సినిమాల మీద తనకున్న ప్రేమకు నిదర్శనం అని రాజు చెప్పుకున్నాడు. ఐతే ఆ మూడు రోజులు ఆగడం బాగానే ఉంది కానీ.. 14న ‘వారసుడు’ విడుదల సమయానికి మాత్రం రాజు ఏమాత్రం రాజీ పడలేదు. ముందు అనుకున్నట్లే.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు దీటుగా థియేటర్లు, షోలు ఇప్పించుకున్నాడు ‘వారసుడు’ చిత్రానికి.

నిజానికి ‘వారసుడు’కు తెలుగులో ఏమంత మంచి టాక్ రాలేదు. కానీ సంక్రాంతికి జనాలు సినిమాలు చూసే మంచి మూడ్‌లో ఉంటారు. థియేటర్లలో ఏ సినిమా ఉన్నా చూస్తారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల ఓవర్ ఫ్లోస్ దీనికి కలిసొచ్చాయి. మంచి మంచి థియేటర్లలో ఆడుతుండటం కూడా ప్లస్ అయింది. దాని వల్ల తొలి మూడు రోజుల్లో ‘వారసుడు’ అంచనాలను మించే వసూళ్లు వచ్చాయి. ఐతే సోమవారం కనుమ పండుగ ముగిశాక సినిమా స్లో అయింది. కానీ అవతల చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ దూకుడు కొనసాగిస్తుండగా.. బాలయ్య చిత్రం ‘వీరసింహారెడ్డి’ కూడా ఓ మోస్తరుగా ఆడుతోంది. కానీ స్క్రీన్లు, షోల విషయంలో ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘వారసుడు’నే రెండో స్థానంలో ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

హైదరాబాద్‌లో బుధవారం బాలయ్య చిత్రాన్ని మించి విజయ్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ షోలు కేటాయించడం చాలామందికి మింగుడు పడడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’కు ఈ రోజు 400కు పైగా షోలు ఇవ్వగా.. ‘వారసుడు’ 300 ప్లస్ షోలతో నడుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ షోలు 270 మాత్రమే కావడం నందమూరి అభిమానులకు పెద్ద షాకే. దీంతో దిల్ రాజును వాళ్లు మళ్లీ టార్గెట్ చేస్తున్నారు.