‘అవతార్-2’పై పంచ్‌లు.. నిర్మాత క్లారిటీ

జేమ్స్ కామెరూన్ ‘అవతార్-2’ మీద విడుదలకు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయిందన్నది వాస్తవం. కానీ కామెరూన్ అండ్ టీం దశాబ్దం పైగా కష్టపడి ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి విజువల్ ట్రీట్ అందించిందని.. ఇలాంటి సినిమాను విమర్శించడం అంటే వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడమే అని.. కథ పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ.

మనం పెట్టిన టికెట్ డబ్బులను మించి విజువల్ ట్రీట్ అందించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకుల సంగతెలా ఉన్నా.. ఈ సినిమాను సినీ ప్రముఖులెవరూ విమర్శించే సాహసం చేయలేదు.

కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ మాత్రం ‘అవతార్-2’ మీద సెటైర్లు వేశాడు.అవతార్-2 ఒక డాక్యుమెంటరీ లాంటి సినిమా అని.. కామెరూన్ తీశాడు కాబట్టి ఈ సినిమాను విజువల్ ట్రీట్, మాస్టర్ పీస్ అనలాల్సిందే అని నాగవంశీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

ఇలాంటి భారీ చిత్రాలు తీయడంలో ఉన్న కష్టం, తపన తెలిసి కూడా ఒక నిర్మాత అయి ఉండి ఇలాంటి పంచులు వేయడం ఏంటి అంటూ ఆయన మీద నెటిజన్లు కౌంటర్లు వేశారు. నాగవంశీ గతంలో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు ముడిపెడితూ ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువ అని విమర్శించారు.

ఐతే ‘అవతార్-2’ మీద తన ట్వీట్‌పై నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తనకు అవతార్-2 సినిమా నచ్చలేదని, తనకు ఏమనిపించిందో అది బయటికి చెప్పడం కూడా తప్పా అని నాగవంశీ ప్రశ్నించాడు.

త్రీడీలో అంతసేపు సినిమా చూస్తుంటే తనకు కళ్లు నొప్పి పుట్టాయని నాగవంశీ తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనికి ప్రతిగా యాంకర్ సుమ స్పందిస్తూ.. ఆ సినిమా చాలామందికి విజువల్ ట్రీట్ లాగా అనిపించిందని అంటే.. రెండు గంటలో మూడు గంటలో అయితే ఓకే కానీ.. మూడు గంటలకు పైగా విజువల్ ట్రీట్ అంటే ఎలా అని నాగవంశీ ప్రశ్నించాడు.