బాలయ్య అభిమానుల ఆక్రోశం

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై తొలి రోజు మామూలు జోరు చూపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఆ సినిమానే ఆడించేశారు గత గురువారం. తెలుగు రాష్ట్రాల అవతల.. యుఎస్‌లో కూడా సినిమా భారీ స్థాయిలోనే రిలీజైంది. ఆ ఒక్క రోజు వసూళ్ల మోత మోగించింది. బాలయ్య చివరి సినిమా ‘అఖండ’తో పోలిస్తే దీనికి తొలి రోజు రెట్టింపు వసూళ్లు రావడం విశేషం. ఇది చూసి నందమూరి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

ఇదే ఊపు కొనసాగిస్తే ఓవరాల్ వసూళ్లలో కూడా బాలయ్య సరికొత్త రికార్డులు నమోదు చేయడం పక్కా అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచి ‘వీరసింహారెడ్డి’ ఊపు కనిపించలేదు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ‘వీరసింహారెడ్డి’ కోసం మెజారిటీ స్క్రీన్లలో కోత పడింది. ఆ తర్వాతి రోజు ‘వారసుడు’ కోసం దిల్ రాజు మరిన్ని థియేటర్లు తీసేసుకున్నారు. కొన్ని ‘కళ్యాణం కమనీయం’కు వెళ్లిపోయాయి.

దీంతో ఏపీ, తెలంగాణ మొదలుకుని.. వరల్డ్ వైడ్ రెండో రోజు ‘వీరసింహారెడ్డి’ వసూళ్లలో భారీ కోత పడింది. సినిమా టాక్ కూడా డివైడ్‌గా ఉండడం కూడా మైనస్ అయి.. ‘వీరసింహారెడ్డి’ ఊపు కొంచెం తగ్గింది. దీంతో బాలయ్య అభిమానుల అంచనాలు తలకిందులైపోయాయి. మంచి స్క్రీన్లు ఉన్న చోట సినిమా బాగానే ఆడుతోంది కానీ.. మిగతా చోట్ల అండర్ పెర్ఫామ్ చేస్తోంది.

మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. పండుగ అడ్వాంటేజీని ఆ సినిమా పూర్తిగా ఉపయోగించుకుంటోంది. టాక్ పరంగా రెంటికీ తేడా లేకపోయినా.. చిరు సినిమానే పైచేయి సాధిస్తుండడం బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రెండు సినిమాలనూ నిర్మించింది మైత్రీ సంస్థే అయినా.. థియేటర్ల కేటాయింపు విషయంలో బాలయ్య చిత్రానికి అన్యాయం చేస్తోందని.. ఎక్కువ థియేటర్లు అట్టిపెట్టలేదని, సరైన స్క్రీన్లు ఇవ్వలేదని.. ఈ పక్షపాతం ఏంటని మైత్రీ వాళ్ల మీద మండిపడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. సరిగా ఆడని వారసుడు, కళ్యాణం కమనీయం చిత్రాలకు థియేటర్లు ఇచ్చి.. బాగా ఆడుతున్న ‘వీరసింహారెడ్డి’కి అన్యాయం చేస్తున్నారని కూడా వారు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.