చిరు, బాలయ్యలకు షాకిస్తాడా?

ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఏదీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది. తమిళ అనువాద చిత్రం ‘తెగింపు’ ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక 12, 13 తారీఖుల్లో రిలీజైన భారీ చిత్రాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల టాక్ కూడా ఏమంత గొప్పగా లేదు.

ఈ రెండు చిత్రాలూ బాలయ్య, చిరుల అభిమానులకు బాగానే అనిపిస్తున్నా.. సగటు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. కేవలం హీరో క్యారెక్టర్ల ఎలివేషన్ మీదే దృష్టిపెట్టిన దర్శకులు కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే టాక్ ఈ సినిమాల వసూళ్ల మీద పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు లేదు.

ఆ సంగతి అలా ఉంచితే పూర్తి సంతృప్తినిచ్చే ఒక్క సినిమా కూడా ఈ సంక్రాంతి ముగిసిపోతుందేమో అన్న ఆందోళన సగటు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఐతే శనివారం ప్రేక్షకుల ముందుకు ఇంకో రెండు చిత్రాలు వస్తున్నాయి.

అందులో ఒకటి.. అనువాద చిత్రం ‘వారసుడు’. కానీ ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆశల్లేవు. తమిళంలోనే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది ఈ విజయ్ సినిమా. ఇక మన తెలుగు సినిమాలనే కలగలిపి తీసినట్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని మన ఆడియన్స్ పట్టించుకుంటారా అన్నది సందేహమే.

ఇక సంక్రాంతికి చివరి ఆశ అంటే.. ‘కళ్యాణం కమనీయం’యే. కథ పరంగా కొంచెం కొత్తదనం ఉండి.. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది దీని ట్రైలర్. యూత్ కూడా రిలేటయ్యే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది.

సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నప్పటికీ యువి క్రియేషన్స్ వాళ్లు కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. టాక్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమా వైపు ఆకర్షితులు కావచ్చు. మరి ఎవ్వరూ ఊహించని విధంగా కంటెంట్‌ పరంగా ఈ సంక్రాంతి విజేత ‘కళ్యాణం కమనీయం’యే అవుతుందేమో చూడాలి.