వారసుడు.. ఇంకేం నిలబడతాడు?


సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో మూడు ఇప్పటికే థియేటర్లలోకి దిగేశాయి. డబ్బింగ్ మూవీ ‘తెగింపు’ మన దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బుధవారం సోలోగా రిలీజ్ కావడం వల్ల దానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాతి రోజు దాని గురించి సౌండే లేదు. అసలు ఆ చిత్రం ఎలా పెర్ఫామ్ చేస్తోందో చూసే అవకాశం కూడా లేకపోయింది. రెండో రోజుకే దానికిచ్చిన థియేటర్లలో మెజారిటీ తీసేసి ‘వీరసింహారెడ్డి’కి ఇచ్చేశారు. తర్వాతి రోజు ‘వాల్తేరు వీరయ్య’ రాకతో ‘తునివు’ అడ్రస్ లేకుండా పోయింది.

‘వీరసింహారెడ్డి’ డివైడ్ టాక్‌తోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఇలాంటి ఊపే చూపిస్తోంది. గురువారం ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. బాలయ్య, చిరు సినిమాల విషయంలో మన ఆడియన్స్ టాక్ గురించి పట్టించుకునేలాలేరు. సినిమా ఎలా ఉన్నా ఎవరి ఆసక్తిని బట్టి వాళ్లు థియేటర్లకు వెళ్లిపోతున్నారు. మెజారిటీ ప్రేక్షకులు రెండు సినిమాలూ చూసే అవకాశం కనిపిస్తోంది.

ఇక సంక్రాంతి రేసులో చివరగా ‘వారసుడు’, ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాలు రిలీజవుతున్నాయి. ‘కళ్యాణం కమనీయం’ మీద కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు కానీ.. దాని ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించింది. దాని బడ్జెట్ కూడా తక్కువ. టాక్ బాగుంటే ఈ సినిమా ఈజీగా బయటపడే ఛాన్సుంది. కానీ ‘వారసుడు’ సంగతే ఏమవుతుందో అనిపిస్తోంది. ఈ చిత్రానికి తమిళంలోనే ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. మాస్ మూవీ కాకపోవడం వల్లో ఏమో విజయ్ గత సినిమాలతో పోలిస్తే దీనికి ఓపెనింగ్స్ తక్కువ వచ్చాయి.

తమిళంలోనే అండర్ పెర్ఫామ్ చేస్తున్న సినిమా.. తెలుగులో చిరు, బాలయ్యల సినిమాలను ఢీకొట్టి నిలవడం కష్టమే అనిపిస్తోంది. ఇక్కడ సినిమాకు ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. 11న వచ్చి ఉన్నా ఓపెనింగ్స్‌కు అయినా గ్యారెంటీ ఉండేది. కానీ రిలీజ్ ఆలస్యమైంది. పైగా తమిళంలో సినిమాకు వచ్చిన టాక్, కలెక్షన్లు చూసి మనోళ్లకు నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది. పైగా ఇది చాలా తెలుగు సినిమాల కలబోతగా అనిపించడం కూడా మైనస్సే. మరి ఈ స్థితిలో దిల్ రాజుకు ‘వారసుడు’ ఏమాత్రం సంతోషాన్నిస్తుందో చూడాలి.