సమంతా మరో సాహసం శాకుంతలం

మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంలో తీశారు తప్ప టాలీవుడ్ కలర్ యుగంలోకి మారాక దీని జోలికి ఎవరూ వెళ్ళలేదు. అడపాదడపా కొన్ని సీన్లు సన్నివేశాల్లో తప్ప పూర్తి నిడివి చిత్రంగా తీసే సాహసం ఎవరూ చేయలేదు. దర్శకుడు గుణశేఖర్ దాన్ని నెరవేర్చారు. సమంతా టైటిల్ రోల్ పోషించిన ఈ విజువల్ గ్రాండియర్ వచ్చే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. సామ్ అనారోగ్యం నుంచి కోలుకుని ప్రత్యక్షంగా పాల్గొన్న ఈవెంట్ ఇదే.

తెలిసిన కథే కాబట్టి దాచే ప్రయత్నం చేయలేదు. భూమి మీద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలిబిడ్డ శాకుంతల(సమంతా). మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా పుట్టినప్పటికీ అనాథగా పెరిగే స్థితి కలుగుతుంది. అందంలో అప్సరసగా పెరిగిన శకుంతలను వేటకు వచ్చిన దుశ్యంత మహారాజు(దేవ్ మోహన్)తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇద్దరూ దగ్గరవుతున్న తరుణంలో దుర్వాస మహర్షి(మోహన్ బాబు) ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. గర్భవతిగా వెళ్లిన తనకు దుశ్యంతుడి నుంచి తిరస్కారం ఎదురవుతుంది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ఏ గమ్యం చేరిందో అదే శాకుంతలం.

ఆద్యంతం త్రీడి ఎఫెక్ట్స్ కోసం తీసిన విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. అధిక భాగం ఇంటీరియర్స్ లో చిత్రీకరించడం వల్ల ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిచింది. సమంతా ఎప్పటిలాగే తన నటన లుక్స్ తో శకుంతలగా ఒదిగిపోయింది. సీనియర్ క్యాస్టింగ్ ని గట్టిగానే సెట్ చేసుకున్న గుణశేఖర్ ఎక్కువ శోకంతో నిండిన ఈ గాథని యుద్ధ సన్నివేశాలు, పోరాటాలతో ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం బలంగా చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ సిజి ఎఫెక్ట్స్ లో గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. మణిశర్మ , శేఖర్ వి జోసెఫ్ లాంటి మంచి టెక్నికల్ టీమ్ తో శాకుంతలంని తీర్చిదిద్దారు. సామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే.