చిరంజీవినీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్న‌డూ చూడ‌ని వింత నిబంధ‌న‌లు గ‌త మూణ్నాలుగేళ్ల నుంచే చూస్తున్నాం. సినిమాలకు స్పెష‌ల్ షోలు, తొలి వారంలో రేట్ల పెంప‌కం, ఏదైనా వేడుక‌లు నిర్వ‌హణ‌కు అనుమ‌తులు ఒక‌ప్పుడు చాలా తేలిగ్గా వ‌చ్చేసేవి. కానీ గ‌త రెండేళ్ల‌లో టికెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. స్పెష‌ల్ షోలు ఆపేయ‌డం.. ఇలా ప‌లు ర‌కాల ఇబ్బందులు త‌లెత్తాయి సినిమాల‌కు. అవి చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు సినిమా వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌డం కూడా క‌ష్ట‌మైపోతోంది ఏపీలో.

ఆల్రెడీ ఓ సంక్రాంతి సినిమా అయిన వీర‌సింహారెడ్డికి ఒంగోలులో ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం.. ఆ త‌ర్వాత వేదిక మార్చుకుని కొన్ని ప‌రిమితుల మ‌ధ్య వేడుక నిర్వ‌హించుకోవ‌డం తెలిసిందే. ఐతే బాల‌య్య తెలుగుదేశం ఎమ్మెల్యే కాబ‌ట్టి ఆయ‌న సినిమాకు అడ్డంకులు సృష్టించ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ చిరంజీవికి సైతం ఇదే ఇబ్బంది త‌లెత్త‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

చిరు సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే జ‌గ‌న్‌కు అస్స‌లు ప‌డ‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ చిరంజీవి.. జ‌గ‌న్‌ను ఎంత‌గానో గౌర‌విస్తున్నారు. ఎంతో స‌న్నిహితంగా మెలుగుతూ వ‌స్తున్నారు. ఆయ‌న వైజాగ్‌లో వేడుక నిర్వ‌హించుకోవ‌డానికి కూడా ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ముందు నుంచి ఆర్కే బీచ్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తూ వ‌చ్చారు. కానీ ఆఖ‌రి నిమిషంలో ఆ వేడుక‌కు అనుమ‌తులు ర‌ద్దు చేశారు. దీంతో హ‌డావుడిగా వేదిక మార్చుకోవాల్సి వ‌చ్చింది.

ఆర్కే బీచ్‌లో చేసిన ప‌నుల‌కు సంబంధించి ఖ‌ర్చంతా వృథా అయింది. కొత్త‌గా మ‌రో చోట హ‌డావుడిగా ఏర్పాట్లు మొద‌లుపెట్టారు. ఇది చిత్ర బృందానికి తీవ్ర ఇబ్బంది క‌లిగిస్తోంది. బాల‌య్య సినిమాకు ఇబ్బంది క‌లిగించి చిరు మూవీని వ‌దిలేస్తే ఎలా అని స‌మ‌న్యాయం పాటించారో.. లేక చిరంజీవి సినిమాను కూడా ఇబ్బంది పెట్టాల‌ని ప‌ట్టుబ‌ట్టి ఇలా చేస్తున్నారో తెలియ‌దు. కానీ బాల‌య్య అభిమానుల్లాగే చిరు ఫ్యాన్స్ కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.