టైమింగ్ మిస్సవుతున్న హిందీ అఖండ

బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన అఖండ నమోదు చేసిన సంచలనాలు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అఘోరాగా బాలయ్య విశ్వరూపం, తమన్ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లిష్టంగా అనిపించే కాన్సెప్ట్ లో దర్శకుడు బోయపాటి శీను ఆధ్యాత్మిక విషయాలను ఊర మాస్ టచ్ తో చెప్పడం ఘనవిజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే అంత పెద్ద సక్సెస్ అందుకుంది. డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో వచ్చాక కూడా అఖండ మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఇదంతా జరిగి ఏడాది దాటిపోయింది.

ఇప్పుడు దీని హిందీ డబ్బింగ్ వెర్షన్ ని పెన్ సంస్థ భారీ ఎత్తున ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఫ్యాన్స్ ఇంతకన్నా మంచి డేట్ దొరకలేదా అని పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా అయిదు రోజుల జనవరి 25కి షారుఖ్ ఖాన్ పఠాన్ కనివిని ఎరుగని రీతిలో అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. సహజంగానే నార్త్ ఆడియన్స్ దృష్టి మిగిలిన వాటి మీద ఉండదు. ఏదో మీడియం రేంజ్ హీరోది అయితే టెన్షన్ అవసరం లేదు కానీ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్షా మూవీ కావడంతో ప్రేక్షకుల దృష్టి సహజంగా పఠాన్ మీదే ఉంటుంది. అలాంటపుడు అయిదు రోజుల రన్ తో అఖండ ఏం సాధించినట్టు.

నిజానికి ఓ రెండు వారాల ముందు ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితం దక్కేది. దృశ్యం 2 తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రాలేదు. సర్కస్ మరీ ఘోరంగా టపా కట్టేసింది. మిగిలినవి వచ్చాయా అనేది కూడా గుర్తు లేనంతగా మాయమైపోయాయి. అలాంటప్పుడు కాంతార తరహా స్పిరిచువల్ టచ్ ఉన్న అఖండ లాంటి కమర్షియల్ డ్రామా ఆ అవకాశాన్ని వాడుకోవడానికి మంచి ఛాన్స్ ఉండేది. ఇప్పుడూ మరీ మించిపోలేదు కానీ పఠాన్ కు ఎలాంటి టాక్ వస్తుందనే దాన్ని బట్టే ఈ లెక్కలన్నీ ఆధారపడి ఉంటాయి.