రోజుల తరబడి సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి రిలీజ్ డేట్లు చెప్పకుండా నాన్చుతూ వచ్చిన తమిళ సినిమాలు ఎట్టకేలకు ఊహించినట్టే ఫేస్ టు ఫేస్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ముందు తెగింపు నిర్మాత బోనీ కపూర్ జనవరి 11 తాము రాబోతున్నామని ప్రకటించిన కొంత సేపటికే దిల్ రాజు వారసుడు అదే తేదీకి దిగుతాడని అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. దీనికి ముందు అనుకున్న తేదీ పన్నెండు. అయితే అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి, ఒక రోజు ఆలస్యంగా రావడం వల్ల అజిత్ కు దక్కే రికార్డులు, తెలుగులో వీరసింహారెడ్డితో క్లాష్ లాంటివి ఇబ్బంది పెట్టే కారణంగా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.
ఇప్పుడీ పరిణామం వల్ల కేవలం తేదీలే కాదు లెక్కలూ మారబోతున్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్ల కోసం టికెట్ల అమ్మకాలు గత పది రోజుల నుంచి జరుగుతున్నాయి. వీటిని క్యాన్సిల్ చేసి రీ ఫండ్ ఇచ్చేసి తిరిగి ఫ్రెష్ బుకింగ్స్ కి తెర తీస్తారు. మరోవైపు బాలయ్య చిరు మూవీస్ లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి వాటి ఫిగర్లలో చేంజ్ ఉండదు కానీ ఎటొచ్చి వరిసు, తునివులకు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ జరిగినవే ఆశించిన స్థాయిలో లేవని అరవ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న టైంలో ఇలా జరగడం కొంత ఆందోళన కలిగించేదే అయినా పొంగల్ కాబట్టి మరీ ఎక్కువ తేడా రాదనే ధీమా కూడా ఉంది.
మరోవైపు పాజిటివ్ అంశాలు లేకపోలేదు. 11న ఏపీ తెలంగాణ థియేటర్లు ఖాళీగా ఉంటాయి. వీటిలో వారసుడు తెగింపు తప్ప మూడో ఆప్షన్ ఉండదు. అజిత్ మూవీకి జరిగిన బిజినెస్ రెండు కోట్ల లోపేనని టాక్. కొంచెం పాజిటివ్ గా ఉన్నా సరే ఫస్ట్ డేనే వీలైనంత ఎక్కువ రాబట్టుకోవచ్చు. వారసుడు లక్ష్యం కూడా తొమ్మిది కోట్లు దాటలేదని తెలిసింది. సో అత్యధిక స్క్రీన్లలో అందుబాటులో ఉంటుంది కాబట్టి పోటీ పరిస్థితుల కంటే మెరుగైన కలెక్షన్లు ఆశించవచ్చు. 12న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వచ్చాక ఎలాగూ వీటి దూకుడుకి బ్రేక్ పడుతుంది కానీ ఫస్ట్ డే వీలైనంత పిండుకోవడం అవసరం. వారంలో తేలనుందిగా చూద్దాం.