ట్రోలింగ్ కి దొరికేసిన వారసుడు

సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందుగా డబ్బింగ్ సినిమాల ట్రైలర్స్ ఒకటి తర్వాత మరొకటి రిలీజ్ అయ్యాయి. ఇటీవల ‘తెగింపు’ ట్రెయిలర్ వచ్చింది. అజిత్ ఈ ట్రైలర్ తో మంచి మార్కులు స్కోర్ చేసి ఎట్రాక్ట్ చేశాడు. ఈసారి విజయ్ వంతు. తాజాగా ‘వారసుడు’ ట్రెయిలర్ రిలీజైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్రైలర్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చేసింది.

ఇప్పటి వారసుడు మీద ఉన్న ఓ మోస్తారు అంచనాలు కూడా ట్రెయిలర్ తుడిచేసింది. వారసుడు కోసం వంశీ పైడిపల్లి తెలుగులో వచ్చిన ఫ్యామిలీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీనే తీసుకోవడం అందరినీ నిరాశ పరుస్తోంది. ఈ కోవలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఉమ్మడి కుటుంబం , సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ వ్యాపార సమస్య, హీరో ఫాదర్ కంపెనీ దక్కించుకునేందుకు చూసే స్టైలిష్ విలన్… ఫైనల్ గా హీరో విలన్ కి చెక్ పెట్టి మళ్లీ తన కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేయడం, ఇలా విజయ్ కోసం వంశీ పడిపల్లి ఓ రొటీన్ ఫార్ములా ఫ్యామిలీ కథే రాసుకోవడంతో నెటిజన్లు వారసుడు ట్రైలర్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

దాదాపు ఇదే కథతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ , రాం చరణ్, ఇలా స్టార్స్ అంతా తెలుగులో సినిమాలు చేసేశారు. మరి కోలీవుడ్ ఎంట్రీ కోసం వంశీ రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు చేసి కొన్ని మార్పులతో ఈ సినిమా తీశాడంటూ ట్రోలర్స్ వీడియో లతో ట్రోలింగ్ మొదలెట్టారు. అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, సరైనోడు, అల వైకుంఠ పురం, అజ్ఞాత వాసి , మహర్షి సినిమాల ఛాయలు వారసుడు లో గట్టిగా కనిపిసున్నాయి. మరి ఈ రొటీన్ కథతో వంశీ పైడిపల్లి తమిళ్, తెలుగు ప్రేక్షకులని సంక్రాంతి బరిలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.