వీరసింహారెడ్డి ఇంటర్వెల్ లో సుమోల రచ్చ

కౌంట్ డౌన్ నెలల నుంచి వారాల్లోకి అక్కడి నుంచి రోజుల్లోకి మారిపోయాక సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానులకు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలగజేస్తోంది. ఈ క్రమంలో మెల్లగా వీటికి సంబంధించిన లీకులు కూడా బయటికి వస్తున్నాయి. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న వీరసింహారెడ్డి మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ జానర్ లో ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన బాలకృష్ణ చాలా గ్యాప్ తర్వాత అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయడంతో ఫ్యాన్స్ ఉద్వేగం మాములుగా లేదు.

ఇంటర్వెల్ కు ముందు వచ్చే కీలమైన యాక్షన్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. పదుల సంఖ్యలో సుమోలను వాడి పెద్ద బాలయ్యకు సంబంధించిన ఒక కీలకమైన ట్విస్టు ఇక్కడ రివీల్ చేశారట. విశ్రాంతికి దారి తీసే ఈ సన్నివేశంతోనే హై వోల్టేజ్ యాక్షన్ కి బీజం పడుతుందని వినికిడి. రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పినట్టు ఎవరూ ఊహించని రీతిలో కొన్ని ఎపిసోడ్లు ఉంటే వాటిలో ఇదే ఫస్ట్ అని టాక్. ఇదంతా వింటే చెన్నకేశవరెడ్డిలో సత్తిరెడ్డి అంటూ భూమిలో నుంచి సుమోలు లేచే సీన్ గుర్తొస్తోందా. దానికి పదిరెట్లు ఉంటుందని ఊరిస్తుంటే ఫ్యాన్స్ ఉద్వేగం ఆగగలదా.

సరిపడా హైప్ ని ఇప్పటికే మోస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ ని ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత చివర్లో మాస్ మొగుడు పాట విడుదల చేయబోతున్నారు. వీటిని ఒంగోలులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయొచ్చు. అయిదు సినిమాలతో గట్టి పోటీ ఎదురుకుంటున్న వీరసింహారెడ్డికి పాజిటివ్ వైబ్రేషన్స్ బలంగానే ఉన్నాయి. అఖండ బ్లాక్ బస్టర్, అన్ స్టాపబుల్ సిరీస్ సూపర్ హిట్ లతో మంచి ఊపుమీదున్న బాలయ్య చేస్తున్న మూవీ కావడంతో ఓపెనింగ్స్ నమోదయ్యే రికార్డులు ఎలా ఉంటాయో చూడాలి. వీరసింహారెడ్డితో పాటు 12నే తెగింపు, వారసుడు రాబోతున్నాయి.