విజయ్ ఫెయిల్.. అజిత్ కొడతాడా?

తమిళంలో ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ చూడబోతున్నారు. అక్కడ ప్రస్తుతం టాప్ స్టార్లయిన విజయ్, అజిత్‌ల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ ఒక్క రోజు వ్యవధిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. వీటిలో ముందుగా జనవరి 11న విడుదల కానున్న ‘తునివు’ ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించింది. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం ట్రైలర్‌ చూస్తే అర్థమైపోయింది.

ఐతే ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు, అజిత్ విన్యాసాలు అభిమానులు బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందా లేదా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. అందుక్కారణం దర్శకుడు హెచ్.వినోద్ ఎంచుకున్న కథాంశమే. ఒక బ్యాంకులో చొరబడ్డ హీరో భారీ దోపిడీకి పాల్పడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన విజయ్ సినిమా ‘బీస్ట్’తో దీనికి పోలికలు కనిపిస్తున్నాయి. అందులో ఒక మాల్‌ను హైజాక్ చేసిన కిడ్నాపర్ల పని పట్టే సోల్జర్ రోల్ చేశాడు విజయ్. కానీ హీరోను ఒక బిల్డింగ్‌లో పెట్టి వీరత్వాన్ని చూపించే సన్నివేశాలు ఏమాత్రం పండలేదు. మన మాస్ హీరోలకు ఈ టైపు పాత్రలు సెట్ కావనడానికి అది ఉదాహరణగా నిలిచింది.

ఇప్పుడు అజిత్ కూడా సినిమా అంతా ఒక బిల్డింగ్‌కు పరిమితం అయ్యే పాత్రే చేస్తున్నాడు. విజయ్ సోల్జర్ పాత్ర చేస్తే.. అజిత్ దానికి భిన్నంగా క్రిమినల్ రోల్ చేస్తున్నాడు. కానీ సినిమా అయితే బిల్డింగ్‌ను దాటి పక్కకు వెళ్లేలా కనిపించడం లేదు. దీంతో ఇది కూడా ‘బీస్ట్’ లాగా తేడా కొడుతుందేమో అన్న భయాలు అజిత్ అభిమానుల్లో లోలోన కలుగుతున్నాయి. మరి వినోద్.. నెల్సన్ లాగా కాకుండా ఆసక్తికరంగా, బిగితో కథను నడిపించి డిఫరెంట్ రిజల్ట్ వచ్చేలా చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటి మంజు వారియర్ కీలక పాత్ర పోషించింది. మన తెలుగు నటుడు అజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.