లేడీ కమెడియన్స్ లో కోవై సరళది ప్రత్యేకమైన బ్రాండ్. ముఖ్యంగా ఓ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా ఆవిడ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ప్రత్యేకమైన గొంతుతో విలక్షమైన శరీర భాషతో తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అంతగా నప్పకపోయినా మృగరాజులో చిరంజీవికి తల్లిగా నటించడం లాంటి సాహసాలు చేశారు. వయసు రిత్యా ఈ మధ్య సినిమాలు తగ్గించిన కోవై సరళ తాజాగా సెంబి అనే ఓ సీరియస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది నిన్న తమిళంలో రిలీజయ్యింది.
దీనికి దర్శకుడు ప్రభు సాల్మన్. మనకు సుపరిచితుడే. ఆ మధ్య వచ్చిన రానా అరణ్య డైరెక్టర్ ఈయనే. ఆడలేదు కానీ అందులో సందేశానికి మంచి ప్రశంసలే దక్కాయి. గతంలో ప్రేమఖైది డబ్బింగ్ మూవీతో దగ్గరైన ఈ ప్రభు ఆ తర్వాత గజరాజుతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఏ కథ తీసుకున్నా అందులో అటవీ నేపథ్యం, గిరిజినుల బ్యాక్ డ్రాప్, కొండలోయల్లో ఉండే జనాల సమస్యలు వీటినే వాడుకుంటాడు. ఈ సెంబిలోనూ అదే రిపీట్ చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు దుర్మార్గుల చేతిలో తన పదేళ్ల మనవరాలు మానభంగానికి గురైతే దానికోసం ఓ బామ్మ చేసే పోరాటమే సెంబి.
ఎన్నడూ చూడని సరికొత్త షేడ్స్ లో కోవై సరళ అదరగొట్టారని కమల్ హాసన్ తో మొదలు మీడియా ప్రతినిధుల దాకా అందరూ సెంబి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కమర్షియల్ ఫ్లేవర్ లేకపోవడం వల్ల కామన్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు కానీ సోషల్ ఇష్యూస్ మీద ఆసక్తి ఉన్న వాళ్లను సెంబి నిరాశపరచదు. వీరతాయిగా సరళ, ఆమె మనవరాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ నీలా పెరఫార్మన్స్ కట్టి పడేస్తాయి. సెకండ్ హాఫ్ ల్యాగ్, క్లైమాక్స్ కొంత నిరాశపరిచేలా సాగినా ఫైనల్ గా చూసుకుంటే ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేం. తెలుగు డబ్బింగ్ రావడం అనుమానమే.