అప్పడు ప్రభాస్ అప్పుల్లో ఉన్నాడా?

ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకునే కథానాయకుల్లో ఒకడు Prabhas. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బడ్జెట్లు, రెమ్యూనరేషన్.. ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే అతనే ఇండియాలో నంబర్ వన్ హీరో అని కూడా చెప్పొచ్చు. అతను ఒక్కో సినిమాకు వంద కోట్లకు తక్కువ పారితోషకం తీసుకోవట్లేదన్నది అంచనా. అలాంటి హీరో పదేళ్ల ముందు అప్పుల్లో ఉన్నాడట.

ఇది ‘బాహుబలి’ చేయడానికి ముందు కథ. అప్పటికే ప్రభాస్ పెద్ద స్టార్. కెరీర్లో కొన్ని మంచి హిట్లున్నాయి. అతడి తండ్రి సూర్యానారాయణరాజు పేరున్న నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరో. వారికి ఆస్తులు, ఆదాయానికి కొదవలేదు. అయినా తాను ఒక టైంలో అప్పుల్లో ఉన్నట్లు ప్రభాస్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘బాహుబలి’ చేయడానికి ముందు సంగతుల గురించి చెబుతూ ప్రభాస్.. మధ్యలో ఈ విషయం చెప్పాడు.

‘బాహుబలి’ ప్లానింగ్ జరుగుతున్న టైంలోనే తాను ‘రెబల్’ సినిమా చేసినట్లు ప్రభాస్ తెలిపాడు. ఈ సినిమా కోసం రాజమౌళిని పర్మిషన్ అడుగుతూ.. కొంచెం అప్పులున్నాయి తీర్చుకోవాలి అని చెప్పినట్లు ప్రభాస్ వెల్లడించాడు. ఆ సినిమా అయ్యాక మళ్లీ ‘మిర్చి’ కోసం రాజమౌళి దగ్గర అనుమతి అడిగినట్లు కూడా ప్రభాస్ తెలిపాడు. అప్పుడు రాజమౌళి భార్య రమ.. ‘‘మనవాడు ఎలాగూ లేటే కదా. ఆ సినిమా కూడా చేసెయ్’’ అని తనతో అన్నట్లు ప్రభాస్ చెప్పాడు.

తన స్నేహితులైన వంశీ-ప్రమోద్ అప్పటికే నిర్మాతలు కావాలని చూస్తున్నారని.. తనకు కూడా సొంత బేనర్ అంటూ ఒకటుంటే బాగుంటుందని అనిపించి.. యువి బేనర్లో ‘మిర్చి’ చేశానని.. అదృష్టవశాత్తూ ఆ సినిమా పెద్ద హిట్టయిందని ప్రభాస్ తెలిపాడు. ‘వర్షం’ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య రిలీజైందని.. ఇంత రిస్క్ వద్దని తాను చెప్పినా.. నిర్మాత ఎం.ఎస్.రాజు మాత్రం వినకుండా అప్పుడే దాన్ని రిలీజ్ చేశారని.. అది కూడా బాగా ఆడి తన కెరీర్లో తొలి పెద్ద హిట్‌గా నిలిచిందని ప్రభాస్ తెలిపాడు.