టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధమాకా’ సినిమా గురించే చర్చ. ఆ సినిమాకు వచ్చిన టాక్‌కు, తెచ్చుకుంటున్న కలెక్షన్లకు అసలు పొంతన లేకుండా ఉండడమే అందుక్కారణం. డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా మంచి వసూళ్లు సాధించిన సినిమాలు లేకపోలేదు కానీ.. ‘ధమాకా’ కలెక్షన్లు ఒక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా రేంజిలో ఉండడమే పెద్ద షాక్.
తొలి రోజును మించి మూడో రోజైన ఆదివారం వసూల్లు రావడం.. ఆ సినిమా థియేటర్లు జనాలతో కళకళలాడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రిస్మస్ సెలవుల్లో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అయింది.
వీకెండ్ తర్వాత కూడా సినిమా బాగా ఆడుతోంది. సినిమా టాక్, రివ్యూలు ఏమీ పట్టించుకోకుండా జనాలు ఈ సినిమా చూసేశారు వీకెండ్లో. ఎప్పుడో కానీ ఇండస్ట్రీలో ఇలాంటి మ్యాజిక్స్ జరగవు. దీంతో ప్రేక్షకులకు సినిమాలో అంతగా ఏం నచ్చింది.. ఈ సినిమా ఇంత బాగా ఆడుతుండడానికి కారణం ఏంటి అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
కథ పరంగా ‘ధమాకా’ ఏమంత ఎగ్జైట్ చేసేది కాదు. ఎప్పుడో ‘రౌడీ అల్లుడు’లో చూసిన పాత కథనే అటు తిప్పి ఇటు తిప్పి వడ్డించారు. హీరో విలన్ల దగ్గర డబుల్ గేమ్ ఆడుతూ తన లక్ష్యాన్ని చేరుకునే టైపు స్క్రీన్ ప్లే కూడా చాలా సినిమాల్లో చూశాం. రవితేజ కూడా స్వయంగా ‘డాన్ శీను’ సహా కొన్ని సినిమాల్లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ట్రై చేశాడు.
ఐతే ప్రేక్షకులు కథ గురించి పట్టించుకోకుండా ఎంటర్టైన్మెంట్ గురించే ఆలోచిస్తున్నట్లున్నారు. ఈ చిత్రంలో మాస్ రాజా తన పాత స్టయిల్లోకి వెళ్లి అల్లరల్లరి చేస్తూ తన అభిమానులను బాగా ఎంటర్టైన్ చేశాడు. అతడి కోసం థియేటర్లకు వచ్చే అభిమానులకు ఏమాత్రం నిరాశ కలగదు.
ఇక యాక్షన్ ప్రియులకు కూడా ఇందులో మంచి ఎంటర్టైన్మెంటే ఉంది. ఇక పాటలన్నీ మంచి ఊపుతో సాగడం సినిమాకు ప్లస్ అయింది. ఆ పాటల్లో హీరోయిన్ శ్రీలీల అందం, డ్యాన్స్ మాస్ ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. ఇలా పైసా వసూల్ వినోదానికి ఢోకా లేకపోవడమే ‘ధమాకా’ విజయానికి కారణమని ఇండస్ట్రీ జనాలు విశ్లేషించుకుంటున్నారు.