టైటిల్ లో ఉన్న తెగింపు చేతల్లో లేదే

అసలే సంక్రాంతి సినిమాల వేడి రోజురోజుకు రాజుకుంటూ ఉంటే Ajith తెగింపు(ఒరిజినల్ వెర్షన్ తునివు)మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు చాలా కూల్ గా ఉంది. ఆ మధ్య ఒక పోస్టర్ తప్ప తెలుగు వరకు చేసింది ఏమీ లేదు. అటు తమిళనాడులోనూ కేవలం హీరో క్రేజ్ మీద వందల కోట్లు వచ్చేస్తాయనే రీతిలో ప్రమోషన్ల విషయంలో చాలా నెమ్మదిగా ఉన్నారు. Vijay వారసుడుకి చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ చేసినా కూడా తలా టీమ్ లో చలనం లేదు. మాములుగా పబ్లిసిటీ హంగులకు దూరంగా ఉండే అజిత్ ఈసారి కొంచెం యాక్టివ్ గా ఉండాలని అభిమానులు కోరుతున్నారు కానీ అదేమీ జరిగేలా అనిపించలేదు.

నిజానికి అజిత్ టాలీవుడ్ మార్కెట్ ఎప్పుడూ అదేపనిగా దృష్టి పెట్టలేదు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వాలి, ప్రేమలేఖ సూపర్ హిట్లతో ఇక్కడ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకునే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో అతని సినిమాలు మన జనానికి చేరలేదు. మధ్య మధ్యలో ఒకటి అరా డబ్బింగులు చేసినా ఆడియన్స్ పట్టించుకోలేదు. అందుకే వలిమై రిలీజప్పుడు కనీసం టైటిల్ ని మార్చాలన్న ఆలోచన చేయకుండా యధాతథంగా అదే తమిళ పేరు పెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఇంతా చేసి అదేమీ విరగబడి ఆడలేదు కానీ డీసెంట్ కలెక్షన్లైతే వచ్చాయి.

ఈ తెగింపు కూడా దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. కాకపోతే హీరో పోలీస్ ఆఫీసర్ కాకుండా విలన్ గ్యాంగ్ లకు పోటీగా భారీ చోరీలు చేస్తుంటాడు. పోలీసులకు దొరక్కుండా వేసే ఎత్తులు పైఎత్తులునే దర్శకుడు వినోత్ కథగా రాసుకున్నాడు. చాలా ఏళ్ళ క్రితం పంజాబ్ లో జరిగిన ఒక భయానక బ్యాంక్ దోపిడీని స్ఫూర్తిగా తీసుకున్నట్టు టాక్ ఉంది. జిబ్రాన్ పాటలకు ఏమంత స్పందన రాలేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, కళ్యాణం కమనీయం, విద్య వాసుల అహంతో ఇంత భారీ పోటీ పెట్టుకుని తెగింపు ఇలా తెగింపు లేకుండా నిర్లిప్తంగా ఉండటం ఏమిటో మరి.