చలపతిరావు… ఆ ట్వీట్ చేసిన ఒక్క రోజులో

టాలీవుడ్‌కు 2022 సంవత్సరం పెద్ద విషాదాన్నే మిగిలిస్తోంది. నెలల వ్యవధిలో తెలుగు సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడం తెలుగు సినీ ప్రేమికులందరినీ వేదనకు గురి చేస్తోంది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు, వయసు మీద పడ్డాక, అనారోగ్య సమస్యలు తలెత్తాక ఎవ్వరైనా కాలం చేయాల్సిందే. కానీ అనారోగ్యం గురించి జనాలకు పెద్దగా సమాచారం లేని టైంలో.. ఉన్నట్లుండి దిగ్గజ నటులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడమే బాధిస్తోంది.

సెప్టెంబరు 11న కృష్ణంరాజు చనిపోవడం అందరికీ పెద్ద షాక్. ఎందుకంటే మార్చిలో ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ రిలీజైంది. ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలున్నట్లు తెలుగు కానీ.. ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు వదులుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక కృష్ణంరాజు కడసారి చూపు కోసం వచ్చిన కృష్ణ.. ఆయన మరణించిన రెండు నెలలకు తానూ వెళ్లిపోయారు. కృష్ణంరాజుతో పోలిస్తే కృష్ణది హఠాన్మరణం అనే చెప్పాలి.

ఇక సుదీర్ఘ కాలంలో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ రెండు రోజుల కిందటే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం ఆయన అభిమానులను బాధించింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతి రావు మరణించడం షాక్. చలపతి రావు ట్విట్టర్లో ఉన్న సంగతి చాలామందికి తెలియదు. చలపతిరావు తమ్మారెడ్డి పేరుతో ఆయన ట్విట్టర్లో ఉన్నారు. ఆయనకు 8 వేల మంది దాకా ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆ పాతమధురాలను గుర్తు చేస్తూ అప్పుడప్పుడూ ఆయన ట్వీట్లు వేస్తుంటారు.

ఆయన సత్యనారాయణ చనిపోయిన రోజు కూడా ట్వీట్ వేశారు. నువ్వు కూడా వెళ్లిపోయావా సత్యన్నా అంటూ కైకాలతో ఆప్యాయంగా తీయించుకున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. ఈ ట్వీట్ వేసిన ఒక్క రోజులో చలపతిరావు కూడా మరణించడం ఆయన ట్విట్టర్ ఫాలోవర్లకు పెద్ద షాక్. ఐతే తన తండ్రి చాలా ప్రశాంతంగా కన్నుమూశారని రవిబాబు చెప్పడం గమనార్హం.