మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని దశాబ్దాల కిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక కరోనా మహమ్మారి విజృంభించిన టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల రూపాయల విరాళాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు.
కాగా భవిష్యత్తులో మరింతగా తన సేవా కార్యక్రమాలను విస్తరించాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఛారిటీ విషయమై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కృష్ణవంశీ కొత్త చిత్రం రంగమార్తాండ కోసం నేనొక నటుణ్ని అనే షాయరీకి చిరు తన గళాన్ని అందించారు.
ఈ అనుభవం గురించి మాట్లాడుతూ చిరు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ కుటుంబం గురించే ఆలోచించానని.. ఇక సమాజానికి తిరిగివ్వడం మీద దృష్టిపెడతానని చిరు వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకాలం నాకేంటి.. నా కుటుంబానికేంటి అనే ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబ సభ్యులందరూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకన్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు.
దాన్ని సమాజాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు. వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా అని చిరు పేర్కొన్నాడు. చిరు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేసినా.. ఇండస్ట్రీలో ఎంతోమందికి వ్చక్తిగత సాయాలు చేసినా సరే.. ఇప్పుడు కొత్తగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో బలంగా ఫిక్సయ్యారని.. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టబోతున్నారని స్పష్టమవుతోంది.